Biden: నవ్వుల పాలైన అమెరికా అధ్యక్షుడు.. నాటో సమ్మిట్‌లో తడబాటు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ తడబడ్డారు. ట్రంప్ తమ ఉపాధ్యక్షుడిని చెప్పిన విధంగానే నాటో వేదికపై నవ్వుల పాలయ్యారు. దీనితో ఆయన అధ్యక్ష పదవికి తగడంటూ విమర్శలు మొదలయ్యాయి. మతిమరుపుతో విమర్శలను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పప్పులో కాలేశారు. నాటో సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీను వ్లాదిమిర్ పుతిన్ అంటూ పరిచయం చేశాడు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించే మీడియా సమావేశానికి కొద్ది గంటల ముందే ఈ పొరపాటు జరగడం గమనార్హం. అయితే, తన తప్పును గ్రహించిన బైడెన్.. వెంటనే దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.
ట్రంప్ తో చర్చలోనూ ఇదే తంతు
పుతిన్ కంటే జెలెన్‌స్కీ మంచి వ్యక్తి అంటూ కవర్ చేసినా.. బైడెన్ మతిమరుపు గురించి ఆందోళనలను కళ్లకు కట్టినట్లు చూపింది. వాష్టింగ్టన్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో బైడెన్ మాట్లాడారు. ''దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, ధైర్యవంతుడు అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మీకు పరిచయం చేస్తున్నాను'' అని ప్రకటించడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు. తన తప్పును వెంటనే తెలుసుకున్న ఆయన.. 'అధ్యక్షుడు పుతిన్! అతను ప్రెసిడెంట్ పుతిన్‌ను ఓడించబోతున్నాడు ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ.. నేను పుతిన్‌ను ఓడించడంపై దృష్టి సారిస్తున్నాను.. దాని గురించి మనం ఆందోళన చెందాలి' అని సవరించే ప్రయత్నం చేశారు