Baloch rebels: 214 మంది పాక్ సైనికులను హతమర్చాం.. బలూచ్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో బలూచ్ తిరుగుబాటుదారులు సంచలన ప్రకటన చేశారు. బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ గ్రూప్ ప్రకటించింది.
తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌ను పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో, చివరకు ఈ చర్యలకు పాల్పడ్డామని వెల్లడించారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ నుంచి బందీలుగా తీసుకున్న సైనికులను హతమార్చినట్లు వారు ప్రకటించారు.
పాక్ ప్రభుత్వం 48 గంటల గడువును ఉల్లంఘించిందని, దీని ఫలితమే ఈ చర్య అని బలూచ్ తిరుగుబాటుదారులు స్పష్టం చేశారు.
Details
సైనికులను బందీలుగా తీసుకున్న తిరుగుబాటుదారులు
తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని 48 గంటల గడువు విధించినా పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించలేదని తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.
పాక్ సైన్యం తమ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుందని ఆరోపించారు.
ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు, తాము తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు.
తమ డిమాండ్లను పాక్ ప్రభుత్వం అంగీకరించనందునే 214 మంది బందీలను హతమార్చినట్లు ప్రకటించారు.
Details
బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి
పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ విడిపోవాలని కోరుకుంటున్న వేర్పాటువాద గ్రూప్ అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం పెషావర్‌కు వెళ్ళే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది.
ఈ ఘటనలో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసిన తిరుగుబాటుదారులు, 400 మందికిపైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు.
ఈ ప్రయాణికుల్లో అధిక సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. బందీలను విడిపించేందుకు పాక్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.
Details
30 గంటల ఆపరేషన్ ముగింపు
30 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ అనంతరం పాక్ సైన్యం హైజాక్ ముగిసిందని ప్రకటించింది.
ఈ ఘర్షణలో 33 మంది పాక్ సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు సాధారణ ప్రయాణికులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే బలూచ్ తిరుగుబాటుదారులు ఈ వాదనను ఖండించారు. తాము తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నామని, భద్రతా దళాలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు.
Details
12 మంది తిరుగుబాటుదారుల మరణం
తమ దరా-ఎ-బోలాన్ ఆపరేషన్‌లో 12 మంది తిరుగుబాటుదారులు మరణించారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
అయితే ఈ ఘర్షణలో మరణించిన వారి సంఖ్యపై భిన్నమైన సమాచారం వస్తోంది. పాక్ సైన్యం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
ఈ ఘటన అనంతరం భద్రతా పరమైన చర్యలను బలపరిచిన పాక్ ప్రభుత్వం, తిరుగుబాటుదారులపై మరింత దాడులు చేపట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.