LOADING...
West Asia War: తాము ఓడుతూ… ప్రపంచాన్నీ ఓడిస్తున్న యుద్ధం!
తాము ఓడుతూ… ప్రపంచాన్నీ ఓడిస్తున్న యుద్ధం!

West Asia War: తాము ఓడుతూ… ప్రపంచాన్నీ ఓడిస్తున్న యుద్ధం!

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధానికి రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ కాలాన్ని వెనక్కి తిరిగి పరిశీలిస్తే, ఇందులో పాల్గొన్న ప్రతి దేశం నష్టపోయిందనే విషయం స్పష్టమవుతోంది. ఆధునిక యుద్ధాల్లో నిజమైన విజేతలు ఉండరని చెప్పే వాదనకు ఈ పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో భాగమైన దేశాలు మాత్రమే కాదు, ప్రపంచమంతా దాని ప్రభావాన్ని అనుభవిస్తోంది.

వివరాలు 

అమెరికా 

యుద్ధాన్ని తక్కువ కాలంలో ముగిస్తామని భావించి రంగంలోకి దిగిన అమెరికాకు ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు నెలలు గడిచినా నిర్ణయాత్మక విజయాన్ని సాధించలేకపోయింది. గల్ఫ్‌ ప్రాంతంలో ఉన్న తన సైనిక కేంద్రాలపై ఇరాన్‌ చేసిన దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది. దీని వల్ల గల్ఫ్‌ దేశాల్లో తనపై ఉన్న విశ్వాసం తగ్గింది. ఇదే సమయంలో ఐరోపా దేశాలతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. హర్మూజ్‌ జలసంధి తెరుచుకునే విషయంలో సహకరించాలన్న విజ్ఞప్తిని నాటో దేశాలు పట్టించుకోకపోవడం అమెరికాకు అనుకోని పరిణామంగా మారింది. దేశీయంగా గ్యాస్‌ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి చేరుకుంది. రాజకీయంగా కూడా ఈ యుద్ధం అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రభావం చూపుతోంది. ఆయన ప్రజాదరణ 37 శాతానికి పడిపోయింది.

వివరాలు 

ఇరాన్‌ 

యుద్ధం కొనసాగుతున్నంతకాలం ఆయన బలహీన నాయకుడిగా కనిపించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్‌ అగ్రనేతలను హతమార్చిన ఆనందం తప్ప ఇజ్రాయెల్‌ కూడా పెద్దగా లాభపడలేదు. పైగా తన రక్షణలో ఉన్న లోపాలు బయటపడ్డాయి. ఇరాన్‌ పైకి ధైర్యంగా కనిపించినప్పటికీ యుద్ధంలో తీవ్రమైన నష్టాలను చవిచూసింది. ఆ దేశ మౌలిక సదుపాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.సుప్రీంనేత ఖమేనీ సహా పలువురు కీలక నాయకులు మరణించారు. ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం 67 నుంచి 69 శాతం మధ్య నమోదవుతోంది. యుద్ధం కారణంగా సుమారు పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. తిరుగుబాటు సంభవించే అవకాశం పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

వివరాలు 

గల్ఫ్‌ దేశాల పరిస్థితి

ఐఆర్‌జీసీ,ప్రభుత్వ వ్యవస్థ మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ యుద్ధం గల్ఫ్‌ దేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనంతో సౌదీ అరేబియా,యూఏఈ,ఇరాక్‌,కువైట్‌,ఖతార్‌ వంటి దేశాల చమురు,సహజ వాయువు ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.ఇజ్రాయెల్‌ కంటే ఎక్కువగా గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు జరిపింది. దీంతో ప్రపంచ వ్యాపార,పర్యాటక కేంద్రాలుగా ఎదిగిన గల్ఫ్‌ నగరాల ప్రతిష్ఠ దెబ్బతింది. తమ రక్షణకు అమెరికా ఉన్నందున ప్రమాదం లేదని భావించిన గల్ఫ్‌ దేశాలకు ఈ యుద్ధం ఆ భ్రమను చెదరగొట్టింది. ఫలితంగా రక్షణ విషయంలో అమెరికాపై ఆధారపడటంపై పునరాలోచన మొదలైంది. గల్ఫ్‌ దేశాల ఐక్యత కూడా దెబ్బతింది. ఒపెక్‌ నుంచి యూఏఈ వైదొలగడం దీనికి సంకేతంగా నిలిచింది.

Advertisement

వివరాలు 

ప్రపంచంపై ప్రభావం

హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలను పెంచింది. చమురు అవసరాలకు గల్ఫ్‌ దేశాలపై ఆధారపడే భారత్‌,చైనా,జపాన్‌ వంటి దేశాలకు ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇంధన ధరలు పెరగడంతో సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఎరువుల తయారీలో ఉపయోగించే యూరియాలో మూడో వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. ఈ మార్గం మూసుకుపోవడంతో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఆఫ్రికా,ఆసియా దేశాల రైతులు పంటలు సాగు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐరోపాకు ముడి చమురు, సహజ వాయువు సరఫరా దెబ్బతింది. దీంతో గ్యాస్‌ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. జర్మనీ, ఇటలీ వంటి దేశాలు 2026 చివరి నాటికి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement