LOADING...
Hormuz Safe:  'హోర్ముజ్ సేఫ్' అంటే ఏంటి?.. నౌకలకు బిట్‌కాయిన్ ఇన్సూరెన్స్ తెచ్చిన ఇరాన్
'హోర్ముజ్ సేఫ్' అంటే ఏంటి?.. నౌకలకు బిట్‌కాయిన్ ఇన్సూరెన్స్ తెచ్చిన ఇరాన్

Hormuz Safe:  'హోర్ముజ్ సేఫ్' అంటే ఏంటి?.. నౌకలకు బిట్‌కాయిన్ ఇన్సూరెన్స్ తెచ్చిన ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలకు బిట్‌కాయిన్ ఆధారిత కొత్త ఇన్సూరెన్స్ వ్యవస్థను ప్రకటించింది. "హోర్ముజ్ సేఫ్" (Hormuz Safe) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ ద్వారా 10బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందని ఇరాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం,ప్రారంభ దశలో ఈ సేవలను ఇరాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీలు,కార్గో యజమానులకు అందించనున్నారు. సరుకు రవాణా ధృవీకరణ పూర్తైన వెంటనే బీమా అమల్లోకి వస్తుందని, యజమానికి అధికారిక రసీదు కూడా ఇస్తామని అధికారులు తెలిపారు.

వివరాలు 

"హోర్ముజ్ సేఫ్" కు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక వెబ్‌సైట్

అయితే ఇప్పటికే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై విధిస్తున్న భారీ టోల్ ఛార్జీలకు అదనంగా ఈ ఇన్సూరెన్స్ ఫీజు ఉంటుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల కొన్ని నౌకలపై ఒక్కో షిప్‌కు 2 మిలియన్ డాలర్ల వరకు టోల్ వసూలు చేసినట్లు సమాచారం. ఇరాన్ త్వరలోనే "హోర్ముజ్ సేఫ్"కు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఆర్థిక ఆదాయ వనరుగా, అలాగే వ్యూహాత్మక ఒత్తిడి కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

ఈ సముద్ర మార్గం ద్వారానే.. ప్రపంచ చమురు,ఎల్‌ఎన్‌జీ (LNG)

ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ (LNG) సరఫరాల్లో భారీ భాగం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. అందుకే హోర్ముజ్ జలసంధిలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లపై ప్రభావం పడుతుంది. ఇక అమెరికా-ఇరాన్ చర్చల విషయానికి వస్తే, ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం చమురు రంగంపై కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా సడలించేందుకు అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి ఒప్పందం కుదిరే వరకు మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని సమాచారం. మరోవైపు అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

Advertisement

వివరాలు 

హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాపై అనిశ్చితి

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బిట్‌కాయిన్ ఆధారిత ఈ ఇన్సూరెన్స్ వ్యవస్థ ద్వారా పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకోవాలని ఇరాన్ చూస్తోంది. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు. అయితే హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. చర్చలు కొనసాగుతున్నప్పటికీ, యుద్ధానికి ముందు ఉన్న సాధారణ పరిస్థితులు త్వరలో తిరిగి రావని ఇరాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది.

Advertisement