Loading...
Trump: యుద్ధ రహస్యాలు లీక్‌ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్‌ పరీక్షలు!
యుద్ధ రహస్యాలు లీక్‌ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్‌ పరీక్షలు!

Trump: యుద్ధ రహస్యాలు లీక్‌ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్‌ పరీక్షలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంపై సొంత ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది. యుద్ధానికి సంబంధించిన కీలక వివరాలు, ఆయుధ నిల్వలకు సంబంధించిన సున్నితమైన సమాచారం మీడియాకు లీక్‌ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నది ఎవరో తెలుసుకునేందుకు ట్రంప్‌ యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా పలువురు సీనియర్‌ సైనికాధికారులకు పాలీగ్రాఫ్‌ (లై డిటెక్టర్‌) పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌తో పాటు పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులకు నిజ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

వివరాలు

50 మంది అధికారులకు పాలీగ్రాఫ్‌ పరీక్షలు

యూఎస్‌ మిలిటరీ జాయింట్‌ స్టాఫ్‌ విభాగానికి చెందిన దాదాపు 50 మంది అధికారులు, సిబ్బందికి గత నెలలో పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

జాయింట్‌ స్టాఫ్‌ విభాగంలో సుమారు 1,500 నుంచి 2,000 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో సైనిక అధికారులు మాత్రమే కాకుండా పౌర సేవల సిబ్బంది కూడా ఉన్నారు.

అమెరికా ఆయుధ నిల్వలు, క్షిపణుల సంఖ్య, ఇరాన్‌పై చేపట్టిన దాడులకు సంబంధించిన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారా? అనే అంశంపై పరీక్షలకు హాజరైన వారిని ప్రశ్నించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అయితే జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌తో పాటు కొందరు సీనియర్‌ మిలిటరీ అధికారులకు మాత్రం ఈ పరీక్షలు నిర్వహించలేదని పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి.

వివరాలు

జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీకైతే తీవ్ర చర్యలు

ఈ వ్యవహారంపై అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ స్పందించింది. అంతర్గత సిబ్బందిపై తీసుకుంటున్న చర్యలు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలపై తాము వ్యాఖ్యానించలేమని పెంటగాన్‌ అధికార ప్రతినిధి సీన్‌ పార్నెల్‌ తెలిపారు.

అయితే జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్‌ అయినట్లు నిర్ధారణ అయితే దాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు.

దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైన్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం ఎంతో ముఖ్యమని, ప్రపంచవ్యాప్తంగా అమెరికా మోహరించిన సైనికుల రక్షణతో ఇది నేరుగా ముడిపడి ఉందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

తరిగిపోతున్న అమెరికా ఆయుధ నిల్వలపై ఆందోళన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోతున్నట్లు కొంతకాలంగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

రక్షణ రంగంలో అత్యంత కొద్దిమంది సీనియర్‌ అధికారులకు మాత్రమే తెలిసే ఈ తరహా సున్నితమైన సమాచారం బయటకు పొక్కడంతో ట్రంప్‌ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

సైనికుల ఫోన్లు, కంప్యూటర్లలో యాడ్‌ ట్రాకర్లు బ్లాక్

మరోవైపు అమెరికా సైన్యం సిబ్బంది ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్లలోని యాడ్‌ ట్రాకర్లను డిసేబుల్‌ చేసింది.

ఈ ట్రాకర్ల ద్వారా సైనిక బలగాలు ఉన్న ప్రాంతాలను గుర్తించే అవకాశం ఉండటంతో పాటు.. వాటి ఆధారంగా సైనికులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్మీతో పాటు ఎయిర్‌ఫోర్స్‌, అమెరికా స్పెషల్‌ ఆపరేషన్స్‌ కమాండ్‌ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది డివైజ్‌లలోని యాడ్‌ ట్రాకర్లను బ్లాక్‌ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

ADVERTISEMENT