Rustam Nabiev: కృత్రిమ కాళ్లు లేకుండానే ఎవరెస్ట్ అధిరోహించిన రుస్తామ్ నబీవ్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాళ్ల సహాయం లేకుండానే అధిరోహించి చరిత్ర సృష్టించాడు రష్యాకు చెందిన పర్వతారోహకుడు రుస్తామ్ నబీవ్. రెండు కాళ్లు కోల్పోయిన వ్యక్తిగా.. కేవలం చేతుల సహాయంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు. 2026 ఎవరెస్ట్ క్లైంబింగ్ సీజన్‌లో భాగంగా మే 20న ఉదయం 8:16 గంటలకు నేపాల్ కాలమానం ప్రకారం 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు రుస్తామ్ నబీవ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించాడు.
వివరాలు
చేతులతోనే ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్న తొలి వ్యక్తి
ఎవరెస్ట్‌ను అధిరోహించిన నాలుగో అంప్యూటీ పర్వతారోహకుడిగా రుస్తామ్ నబీవ్ గుర్తింపు పొందాడు. అయితే కృత్రిమ కాళ్లు ఉపయోగించకుండా కేవలం చేతుల సహాయంతో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2006లో మార్క్ ఇంగ్లిస్ అనే పర్వతారోహకుడు కృత్రిమ కాళ్ల సహాయంతో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి డబుల్ అంప్యూటీగా నిలిచాడు.
వివరాలు
రుస్తామ్ నబీవ్ ఎవరు?
రుస్తామ్ నబీవ్ రష్యా ఎయిర్‌బోర్న్ ఫోర్సెస్‌లో మాజీ పారాట్రూపర్‌గా పనిచేశాడు. 2015 జూలై 12న రష్యాలోని ఓమ్స్‌క్ ప్రాంతంలో సైనిక శిక్షణ శిబిరం కూలిపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటనలో అతని రెండు కాళ్లను తొలగించాల్సి వచ్చింది. మొత్తం 16 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే తన వైకల్యాన్ని బలహీనతగా తీసుకోకుండా జీవితంలో ముందుకు సాగాడు. ప్రొఫెషనల్ స్లెడ్జ్ హాకీ క్రీడాకారుడిగా మారి మాస్కోకు చెందిన 'ఫీనిక్స్' క్లబ్ తరఫున ఆడాడు. తర్వాత ఫిట్‌నెస్ కోచ్‌గా, బ్లాగర్‌గా మారి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ క్రమంలో తన స్వస్థలమైన బష్కోర్తోస్తాన్ ప్రాంత హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యుడిగానూ నియమితుడయ్యాడు.
వివరాలు
ఇప్పటికే ఎన్నో పర్వతాలను అధిరోహించిన నబీవ్
ఎవరెస్ట్‌కు ముందే రుస్తామ్ నబీవ్ పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించాడు. 2020లో యూరప్‌లోనే ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎల్బ్రస్‌ను ఎక్కాడు. 2021లో మౌంట్ మనాస్లు, మౌంట్ కిలిమంజారో, మౌంట్ కజ్‌బెక్ శిఖరాలను అధిరోహించాడు. 2022లో దక్షిణ అమెరికాలోని అకాంకాగువా పర్వతాన్ని కూడా విజయవంతంగా ఎక్కాడు.