Immigration Crackdown:ట్రంప్ తరహాలో యూకే.. ఇండియన్ రెస్టారెంట్లలో వేట.. అక్రమ వలసదారులు ఉంటే..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే భారత్ సహా పలు దేశాల అక్రమ వలసదారులను గుర్తించి, అరెస్టు చేసి, ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి పంపిస్తున్నారు.
ఈ క్రమంలో, అమెరికా మిత్రదేశమైన బ్రిటన్ కూడా ఇదే దిశగా ముందడుగు వేసింది.
అక్కడి ప్రభుత్వం స్వదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయ వలసదారులను గుర్తించేందుకు భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తోంది.
ముఖ్యంగా భారతీయుల అధికంగా పనిచేస్తున్న రెస్టారెంట్లు, నెయిల్ బార్‌లు, కన్వీనియన్స్ స్టోర్‌లు, కార్ వాష్‌లపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
ఈ నేపథ్యంలో, బ్రిటన్ హోమ్ ఆఫీస్ అక్రమ వలసదారులను బస్సు నుంచి దించి, విమానం మెట్లు ఎక్కిస్తున్న దృశ్యాల వీడియోను విడుదల చేసింది.
వివరాలు
దేశవ్యాప్తంగా 609 మందిని అరెస్టు
గత ఏడాది జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 19,000 మంది శరణార్థులు, విదేశీ నేరస్థులు బ్రిటన్‌లో ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఏడాది జనవరిలో ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు దేశవ్యాప్తంగా 828 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి, 609 మందిని అరెస్టు చేశాయి.
2023 జనవరితో పోలిస్తే ఈ దాడులు 48% పెరిగాయని, అరెస్టుల సంఖ్య 73% పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజాగా ఉత్తర ఇంగ్లండ్‌లోని హంబర్‌సైడ్‌లో ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్‌పై ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడి చేసి, ఏడుగురిని అరెస్టు చేయగా, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
రెస్టారెంట్ యజమానులు వలసదారులను దోచుకుంటున్నట్లు ఆరోపణ
ఇమిగ్రేషన్ నిబంధనల అమలుపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
అక్రమ వలసదారులకు ఉపాధి కల్పిస్తున్న రెస్టారెంట్ యజమానులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని, వారు వలసదారులను దోచుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు.
ఇప్పటివరకు అనేక మంది వ్యక్తులు అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించి పని చేస్తున్నప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవడం ఆలస్యం అయిందని అధికారులు అంటున్నారు.
అమెరికా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో, బ్రిటన్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.