Bordeaux Wine: బోర్డోకు కార్చిచ్చు ముప్పు.. ప్రపంచ వైన్ రాజధానిపై పెరుగుతున్న ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వైన్ రాజధానిగా గుర్తింపు పొందిన ఫ్రాన్స్‌లోని బోర్డో (Bordeaux) నగరాన్ని కార్చిచ్చు తీవ్రంగా కలవరపెడుతోంది. ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో ప్రారంభమైన అగ్నికీలలు క్రమంగా విస్తరిస్తూ ప్రస్తుతం బోర్డో శివార్ల వరకు చేరుకున్నాయి. నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తున్నాయని బోర్డో మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నికీలలు నగరంలోకి ప్రవేశించకుండా శివార్ల వద్దే అడ్డుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వైన్ తయారీ కేంద్రంగా బోర్డోకు ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాలుగా "బోర్డో" అనే పేరు వైన్‌కు పర్యాయపదంగా మారిపోయింది. ఇక్కడ తయారయ్యే Bordeaux Wine ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
వివరాలు
అత్యాధునిక ప్రపంచస్థాయి వైన్ మ్యూజియం
ఈప్రాంతంలో ద్రాక్ష సాగుకు దాదాపు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది.రోమన్ల కాలంలోనే ఇక్కడి సమశీతోష్ణ వాతావరణం ద్రాక్ష పంటకు అత్యంత అనుకూలమని గుర్తించారు.
దీంతో బోర్డో క్రమంగా ప్రముఖ వైన్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందింది.అనంతరం ఆంగ్లేయుల పాలనలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఛానల్ మార్గంగా వైన్ ఎగుమతులు మరింత వేగం పుంజుకున్నాయి.
నదీ మార్గాలు,అనుకూల వాతావరణం,వ్యాపార అవకాశాలు కలిసి బోర్డోను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నగరంగా తీర్చిదిద్దాయి.
ప్రస్తుతం బోర్డో ప్రాంతం వేలాది ద్రాక్ష తోటలు,వైన్ ఎస్టేట్లకు నిలయంగా నిలిచింది.
వైన్ చరిత్రతో పాటు నగర సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసే అత్యాధునిక ప్రపంచస్థాయి వైన్ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది.
ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈమ్యూజియాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.
వివరాలు
నగరవ్యాప్తంగా 362కు పైగా చారిత్రక, స్మారక కట్టడాలు
బోర్డోలోని గరోన్ నదిపై ఉన్న ప్రముఖ నౌకాశ్రయం "పోర్ట్ ఆఫ్ ది మూన్" (Port of the Moon) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
గరోన్ నది నెలవంక ఆకారంలో వంపు తిరుగుతూ ప్రవహించడంతో ఈ నౌకాశ్రయానికి ఆ పేరు వచ్చింది.
2007లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నదిపై నిర్మించిన సుందరమైన వంతెనలు, ప్రపంచ ప్రసిద్ధ 'వాటర్ మిర్రర్' పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
సుమారు 3,450 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రతిబింబ జలవేదికలో ఎదురుగా ఉన్న రాజభవనాల ప్రతిబింబాలు అద్భుతంగా కనిపిస్తాయి.
నగరవ్యాప్తంగా 362కు పైగా చారిత్రక, స్మారక కట్టడాలు బోర్డో వైభవాన్ని చాటుతున్నాయి.
వివరాలు
ఆహార ప్రియులకు కూడా బోర్డో ప్రత్యేక గమ్యస్థానం
ఆహార ప్రియులకు కూడా బోర్డో ప్రత్యేక గమ్యస్థానంగా పేరొందింది.
సీఫుడ్‌తో పాటు వివిధ రకాల వైన్‌లను కలిపి తయారుచేసే వంటకాలు ఇక్కడి ప్రత్యేకత.
రమ్,వెనిల్లా రుచులతో తయారయ్యే 'కనలె' (Canelé) పేస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
సుమారు 1.2కిలోమీటర్ల మేర విస్తరించిన షాపింగ్ హబ్‌లో నడుచుకుంటూ షాపింగ్ చేసే అవకాశం ఉండగా,ఐరోపాలోనే ఎత్తైన ఇసుక దిబ్బ కూడా బోర్డో సమీపంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది.
అందుకే ఆహార,పానీయ ప్రియులకు బోర్డోను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా భావిస్తారు.
వివరాలు
ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. స్పెయిన్ ప్రభుత్వం హెచ్చరికలు
ఇదిలా ఉండగా,గత కొన్ని రోజులుగా ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు కార్చిచ్చుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో ఫ్రాన్స్‌లో సుమారు 2.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు కార్చిచ్చు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 75 వేల మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్పెయిన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.