Loading...
Bangladesh: పాక్‌-టర్కీ-సౌదీ కూటమిలోకి బంగ్లాదేశ్‌? భారత్‌కు కొత్త తలనొప్పి!
పాక్‌-టర్కీ-సౌదీ కూటమిలోకి బంగ్లాదేశ్‌? భారత్‌కు కొత్త తలనొప్పి!

Bangladesh: పాక్‌-టర్కీ-సౌదీ కూటమిలోకి బంగ్లాదేశ్‌? భారత్‌కు కొత్త తలనొప్పి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు పాకిస్థాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్‌ కూడా అడుగుపెట్టే అవకాశాలపై చర్చ మొదలైంది. అదే జరిగితే భారత్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఢిల్లీకి ఇది బంగ్లాదేశ్‌ తీసుకునే మరో విదేశాంగ నిర్ణయంగానే చూడాలా? లేక భారత్‌ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలకు ఇది సంకేతమా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ఆసియా భౌగోళిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌ తొలిసారి సౌదీ అరేబియా-పాకిస్తాన్‌-టర్కీ రక్షణ వ్యవస్థలో చేరే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే 'ముందు బంగ్లాదేశ్‌ ప్రయోజనాలే' అనే విధానాన్ని స్పష్టం చేస్తూ ఈ అంశంపై తలుపులు తెరిచి ఉంచింది. దీంతో దక్షిణాసియాలో కొత్త వ్యూహాత్మక సమీకరణాలపై ఆసక్తి పెరిగింది.

వివరాలు

అసలు ఈ కూటమి ఏంటి?

ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్‌, టర్కీ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, మిగిలిన రెండు దేశాలపై కూడా దాడి జరిగినట్లుగా పరిగణించేలా పరస్పర రక్షణ సహకారానికి రూపకల్పన చేశారు.

ఇప్పుడు ఇదే రక్షణ వ్యవస్థలోకి బంగ్లాదేశ్‌ కూడా వస్తే.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్‌ కబీర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి.

వివరాలు

బంగ్లా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం

సౌదీ అరేబియా, పాకిస్తాన్‌, టర్కీతో కూడిన ఆర్థిక లేదా రక్షణ వ్యవస్థలో చేరే అవకాశంపై బంగ్లాదేశ్‌ సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది బంగ్లాదేశ్‌, అక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.

మరో సహాయ మంత్రి షామా ఒబైద్‌ ఇస్లాం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ కూటమిలో చేరాలన్నా జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని తెలిపారు

ADVERTISEMENT

వివరాలు

భారత్‌కు వెంటనే సైనిక ముప్పు ఉందా?

బంగ్లాదేశ్‌ ఈ కూటమిలో చేరితే భారత్‌కు తక్షణమే సైనిక ముప్పు ఏర్పడుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అంచనాకు తావు లేదు.

ఈ రక్షణ ఒప్పందం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఏర్పడిందని ఎక్కడా ప్రకటించలేదు.కాబట్టి బంగ్లాదేశ్‌ కూటమిలో చేరినంత మాత్రాన భారత్‌పై యుద్ధ ముప్పు పెరుగుతుందని చెప్పడం తొందరపాటు అవుతుంది.

అయితే సమస్య కేవలం సైనిక కోణంలో చూడాల్సిన అంశం కాదు. దౌత్యం, వ్యూహాత్మక ప్రభావం, ప్రాంతీయ శక్తుల సమీకరణాల పరంగా దీని ప్రభావం ఉండొచ్చు.

భారత్‌కు బంగ్లాదేశ్‌ సాధారణ పొరుగు దేశం కాదు. ఈశాన్య భారతదేశానికి భౌగోళికంగా అత్యంత కీలకమైన దేశం.

ADVERTISEMENT

వివరాలు

పాకిస్తాన్‌ ఉండటంపై మరింత ప్రాధాన్యం సంతరించుకుంది

సరిహద్దు భద్రత, వాణిజ్యం, రవాణా మార్గాలు, ప్రాంతీయ కనెక్టివిటీ వంటి అనేక అంశాల్లో ఢాకాతో న్యూఢిల్లీ సంబంధాలు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా ఇరు దేశాల సంబంధాలు కూడా ఈ అంశాల చుట్టూనే బలపడ్డాయి.

అలాంటి బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌, టర్కీ, సౌదీ అరేబియాలతో కూడిన రక్షణ వ్యవస్థకు దగ్గరవడం ఢిల్లీకి మాత్రం సాధారణ పరిణామం కాదు.

ముఖ్యంగా ఈ సమీకరణంలో పాకిస్తాన్‌ ఉండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

వివరాలు

పాకిస్తాన్‌కు దౌత్యపరంగా బలం?

భారత్‌-పాకిస్తాన్‌ సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్నాయి. ఈ సమయంలో ఢాకా ఇస్లామాబాద్‌తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటే పాకిస్తాన్‌కు దౌత్యపరంగా అదనపు బలం లభించే అవకాశం ఉంది.

దక్షిణాసియాలో భారత్‌కు వ్యతిరేకంగా తన ప్రభావాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్‌కు కొత్త వేదిక లభించినట్లవుతుందని విశ్లేషణలు ఉన్నాయి.

ఇక టర్కీ కూడా ఈ సమీకరణంలో కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్తాన్‌తో టర్కీకి ఇప్పటికే సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌తోనూ టర్కీ రక్షణ సహకారాన్ని విస్తరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అత్యంత ప్రభావశీలమైన దేశం.

వివరాలు

ఇప్పటివరకూ స్పష్టమైన ఆధారాలు లేవు

ఈ మూడు దేశాలతో బంగ్లాదేశ్‌ ఒకే రక్షణ వ్యవస్థలోకి వస్తే.. పాకిస్తాన్‌కు పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వరకు విస్తరించే కొత్త దౌత్య నెట్‌వర్క్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది.

అయితే బంగ్లాదేశ్‌ తక్షణమే ఈ కూటమిలో చేరబోతోందని చెప్పడానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు. ఢాకా చెబుతున్న 'బంగ్లాదేశ్‌ ఫస్ట్‌' విధానమే ఇక్కడ కీలకం.

ఆర్థిక, వాణిజ్య లేదా భద్రతా పరంగా తమకు ప్రయోజనం ఉంటేనే ముందడుగు వేస్తామని బంగ్లాదేశ్‌ స్పష్టం చేస్తోంది.

కాబట్టి ఇది భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఇప్పుడే నిర్ధారించలేం.

వివరాలు

ఢిల్లీకి కీలక హెచ్చరిక

అయినప్పటికీ బంగ్లాదేశ్‌ వైఖరి భారత్‌కు ఒక కీలక హెచ్చరికగా భావించవచ్చు. ఢాకా తన విదేశాంగ విధానాన్ని కొత్తగా సమతుల్యం చేసుకునే ప్రయత్నం చేస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారత్‌తో సంబంధాలను కొనసాగిస్తూనే పాకిస్తాన్‌, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బంగ్లాదేశ్‌ పెంచుకుంటే.. దక్షిణాసియాలో భారత్‌కు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

అంటే బంగ్లాదేశ్‌ ఈ కూటమిలో చేరినంత మాత్రాన భారత్‌ సరిహద్దుల్లో వెంటనే సైనిక ముప్పు ఏర్పడుతుందని చెప్పలేం.

కానీ భారత్‌ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాల్లో ఇది మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ తన 'నెయిబర్‌హుడ్‌ ఫస్ట్‌' విధానాన్ని మరింత చురుగ్గా అమలు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు.

ADVERTISEMENT