డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు
ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ( Gurpatwant Singh Pannun) భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో బెదిరింపు వీడియోను విడుదల చేసాడు. తనను చంపడానికి భారత్ కుట్ర చేసి, విఫలమైందని ఆ వీడియోలో ఆరోపించాడు. దానికి ప్రతీకారంగా డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని వీడియోను విడుదల చేశాడు. 2001లో డిసెంబర్ 13న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసారు. దీంతో ఈ నెల 13వ తేదీకి ఆ దుర్ఘటన జరిగి 22 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌పై దాడి చేస్తామని పన్నూన్ వీడియోను విడుదల చేయడం ఆందోళనను కలిగిస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో భద్రతా వర్గాలు అలర్ట్
ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో పన్నూన్ బెదిరింపు వీడియోపై భద్రతా వర్గాలు అలర్ట్ అయ్యాయి. భారత్‌కు వ్యతిరేకంగా K-2 (కాశ్మీర్-ఖలిస్థాన్) అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పన్నూన్‌ను ఇండియాపై పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉసిగొల్పుతుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పన్నూన్‌ను చంపడానికి చేసిన కుట్రను భగ్నం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కుట్ర భారత్ నుంచే జరిగిందని, విచారణకు సహకరించాలని భారత ప్రభుత్వానికి యూఎస్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసులో యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు 52 ఏళ్ల భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తాను అరెస్టు చేసారు. నిఖిల్ గుప్తా పన్నూన్‌ను చంపడానికి కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపారు.