Times Square Knife Attack: టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన కత్తుల దాడి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ రెండు కత్తులను బ్యాగులో తీసుకొచ్చి టైమ్స్ స్క్వేర్ వద్ద హల్‌చల్ చేసినట్లు సమాచారం. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి తీవ్రంగా గాయపడి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితురాలు పోలీసులపైనా దాడికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.
వివరాలు
ఉద్యోగానికి తిరిగొచ్చిన కొద్దిరోజులకే..
ఈ కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడిలో మృతిచెందిన ఎరిన్ పియాసెంటి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
ఇటీవలే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఐదు నెలల మాతృత్వపు సెలవు అనంతరం ఆమె తిరిగి విధుల్లో చేరారు.
ఉద్యోగంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
భర్త, చిన్నారితో కలిసి దిగిన ఫొటోను ఎరిన్ ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మరింత తీవ్రం చేసింది.
వివరాలు
బ్యాంక్ ఆఫ్ అమెరికా దిగ్భ్రాంతి
ఎరిన్ పియాసెంటి మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతితో సంస్థలో విషాదం నెలకొంది.
సహోద్యోగులు, కుటుంబసభ్యులు ఆమెను కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.