LOADING...
World Bank: ఆదాయ వర్గీకరణలో భారత్‌కు నిరాశ.. శ్రీలంక ఎగువ మధ్య ఆదాయ దేశం

World Bank: ఆదాయ వర్గీకరణలో భారత్‌కు నిరాశ.. శ్రీలంక ఎగువ మధ్య ఆదాయ దేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం 'నయా భారత్', 'వికసిత్ భారత్' లక్ష్యాలను ప్రస్తావిస్తున్న వేళ, పలు అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై భిన్న చిత్రాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు తాజా ఆదాయ వర్గీకరణలో భారత్ మరోసారి దిగువ-మధ్య-ఆదాయ దేశాల జాబితాలోనే కొనసాగింది. శ్రీలంక, వియత్నం, ఫిలిప్పీన్స్ ముందంజ ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన తాజా ఆదాయ వర్గీకరణ ప్రకారం శ్రీలంక, వియత్నం, ఫిలిప్పీన్స్ దేశాలు ఎగువ-మధ్య-ఆదాయ దేశాల జాబితాలో స్థానం సంపాదించాయి. ఇటీవలే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక తిరిగి ఈ వర్గంలోకి చేరడం విశేషంగా నిలిచింది. మరోవైపు భారత్ మాత్రం 2007 నుంచి కొనసాగుతున్న దిగువ-మధ్య-ఆదాయ దేశ హోదాను ఇప్పటికీ కొనసాగిస్తోంది.

వివరాలు 

సంక్షోభం నుంచి శ్రీలంక పునరాగమనం

2022లో సార్వభౌమ రుణ ఎగవేత, సుమారు 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాల చెల్లింపుల నిలిపివేత వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంది. అయితే పరిశ్రమలు, పర్యాటక రంగం, ఆర్థిక సేవల విస్తరణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంది. 2025లో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ఈ పురోగతితో స్వల్ప తేడాతో ఎగువ-మధ్య-ఆదాయ దేశాల జాబితాలోకి శ్రీలంక తిరిగి చేరిందని పేర్కొంది. దీనిని సంక్షోభం నుంచి కోలుకున్న విజయగాథగా ప్రపంచ బ్యాంక్ అభివర్ణించింది.

వివరాలు 

ప్రపంచ బ్యాంక్ ఆదాయ వర్గీకరణ ఎలా ఉంటుంది?

దేశాల ఆదాయ స్థాయిని నిర్ణయించేందుకు ప్రపంచ బ్యాంక్ తలసరి స్థూల జాతీయ ఆదాయం (Gross National Income - GNI per capita)ను ప్రమాణంగా తీసుకుంటుంది. ఒక దేశ పౌరులు, వ్యాపార సంస్థలు దేశంలోనైనా, విదేశాల్లోనైనా సంపాదించిన మొత్తం ఆదాయాన్ని జీఎన్‌ఐగా పరిగణిస్తారు. ఆ మొత్తాన్ని జనాభాతో భాగించి తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. ప్రస్తుత ప్రమాణాల ప్రకారం: తలసరి జీఎన్‌ఐ 1,136 నుంచి 4,495 డాలర్ల మధ్య ఉంటే దిగువ-మధ్య-ఆదాయ దేశంగా గుర్తిస్తారు. తలసరి జీఎన్‌ఐ 4,496 నుంచి 13,935 డాలర్ల మధ్య ఉంటే ఎగువ-మధ్య-ఆదాయ దేశంగా వర్గీకరిస్తారు. ప్రస్తుతం భారత్ తలసరి జీఎన్‌ఐ సుమారు 2,500 నుంచి 2,700 డాలర్ల మధ్య ఉండటంతో దిగువ-మధ్య-ఆదాయ దేశాల విభాగంలోనే కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

పలు అంతర్జాతీయ సూచీల్లో భారత్ వెనుకబడిన పరిస్థితి

ఆర్థిక,సామాజిక అభివృద్ధి,విద్య,వైద్యం,పారిశ్రామిక రంగాలతో పాటు పౌర స్వేచ్ఛలు, పత్రికా స్వేచ్ఛ, లింగ సమానత్వం, పాస్‌పోర్ట్ బలం, భద్రత వంటి 50కిపైగా అంతర్జాతీయ సూచీల్లో భారత్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వివిధ నివేదికల్లో వెల్లడవుతోంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ సూడాన్, రువాండా, కాంగో వంటి దేశాలతో సమాన స్థాయిలో నిలుస్తున్నట్లు పేర్కొనబడింది. ప్రజాస్వామ్య సూచీలో దేశం 46వ స్థానంలో ఉంది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్‌లో 2014లో 114వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 143వ స్థానానికి చేరింది. ప్రపంచ ఆనంద సూచీలో 116వ స్థానంలో నిలిచింది. పింఛన్ సూచీలోనూ దిగువ స్థానాల్లోనే కొనసాగుతోంది. అలాగే పత్రికా స్వేచ్ఛ సూచీలో 151వ స్థానం నుంచి 157వ స్థానానికి పడిపోయినట్లు సంబంధిత నివేదికలు తెలియజేస్తున్నాయి.

Advertisement