Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) భారత్ పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం బీజింగ్ నుంచి బయల్దేరిన ఆయన.. మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత దిల్లీ వేదికగా ఇరు దేశాలు పాల్గొంటున్న తొలి ఉన్నతస్థాయి సమావేశం కూడా ఇదే. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ-జిన్‌పింగ్ (PM Modi-Xi Jinping) మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లకు పైగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ఇరాన్ యుద్ధం (Iran War) కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది.
వివరాలు
శని, ఆదివారాల్లో శిఖరాగ్ర సదస్సు
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. శని, ఆదివారాల్లో ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ముఖాముఖి చర్చలు జరపనున్నారని విదేశాంగశాఖ వెల్లడించింది.
గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జరగనున్న మోదీ-జిన్‌పింగ్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వివరాలు
భేటీకి ముందు.. చైనా మెసేజ్
జిన్‌పింగ్ భారత్ పర్యటనకు ముందు చైనా (China) ఓ కీలక సందేశాన్ని పంపింది. పొరుగున ఉన్న దేశాలతో స్నేహంగా ఉండటం, దీర్ఘకాల మైత్రిపై దృష్టి సారించడం వంటి అంశాలను అందులో ప్రస్తావించింది.
''ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది.
పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు విభేదాలను పరిష్కరించుకోవడానికి మేం కృషి చేస్తున్నామని భారత్‌లోని చైనా రాయబారి గ్జు ఫీహాంగ్ ఎక్స్ వేదికగా ఈ సందేశాన్ని పోస్టు చేశారు
వివరాలు
ఆరేళ్ల తర్వాత భారత్‌కు చైనా ఎయిర్‌లైన్ సర్వీసులు
మరోవైపు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ (China Southern Airline) ఆరేళ్ల విరామం తర్వాత భారత్‌కు విమాన సర్వీసులను పునఃప్రారంభించనుంది.
సెప్టెంబర్ 21 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో గాంగ్జౌ-దిల్లీ మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు.
జిన్‌పింగ్ భారత పర్యటన నేపథ్యంలో చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ఈ ప్రకటన చేసింది.