LOADING...
2026 Renault Megane EV: కొత్త డిజైన్‌తో 2026 రెనాల్ట్ మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్.. 500 కి.మీ రేంజ్!
కొత్త డిజైన్‌తో 2026 రెనాల్ట్ మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్.. 500 కి.మీ రేంజ్!

2026 Renault Megane EV: కొత్త డిజైన్‌తో 2026 రెనాల్ట్ మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్.. 500 కి.మీ రేంజ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెంచ్ ఆటో మొబైల్ దిగ్గజం Renault తన అప్‌డేటెడ్ 2026 మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన ప్లాట్‌ఫామ్‌పై తయారైన కంపెనీ తొలి ఉత్పత్తి మోడల్ అయిన ఈ కారు, తాజా డిజైన్‌తో పాటు మెరుగైన రేంజ్‌ను అందిస్తోంది. కొత్త మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్‌లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీతో కారు WLTP ప్రమాణాల ప్రకారం గరిష్ఠంగా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదు. 67kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అమర్చడంతో వాహనం గ్రౌండ్ క్లియరెన్స్‌ను మెరుగుపరిచేందుకు రైడ్ హైట్‌ను 20 మిల్లీమీటర్లు పెంచారు. దీంతో స్థిరత్వం, రహదారులపై ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనున్నాయి.

వివరాలు 

15 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 24 నిమిషాల్లో ఛార్జ్

ఛార్జింగ్ విషయంలో కూడా కంపెనీ కీలక మార్పులు చేసింది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని 165kWకు పెంచడంతో కారు బ్యాటరీని 15 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 24నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది గత మోడల్‌తో పోలిస్తే గణనీయంగా వేగవంతమైన ఛార్జింగ్ సమయం. పనితీరు పరంగా చూస్తే,గత మోడల్‌లో ఉన్న ఎలక్ట్రిక్ మోటారునే కొనసాగించారు. ఈ మోటార్ గరిష్ఠంగా 215 హార్స్‌పవర్ శక్తి, 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డిజైన్ పరంగా కొత్త డైమండ్ మోటిఫ్ లైటింగ్ సిగ్నేచర్,గ్లోసీ బ్లాక్ ఫాక్స్ గ్రిల్‌తో కారు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వెనుక భాగాన్ని కూడా త్రీ-డైమెన్షనల్ లుక్ వచ్చేలా పునర్నిర్మించారు. వాహనంలో వాతావరణ నియంత్రణ కోసం ప్రత్యేక బటన్లను కొనసాగించడం విశేషం.

వివరాలు 

రెండు వేరియంట్లలో అందుబాటులోకి..

అలాగే 12 అంగుళాల వర్టికల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 12.3 అంగుళాల పూర్తిస్థాయి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అందించారు. భద్రతా పరంగా కొత్త యూరోపియన్ నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్ అప్రమత్తతను గమనించే ఇన్-కార్ కెమెరాను అమర్చారు. ఇదే వ్యవస్థ డ్రైవర్ గుర్తింపును కూడా నిర్వహిస్తూ సీటు పొజిషన్, ఇష్టమైన మీడియా సెట్టింగ్స్ వంటి వ్యక్తిగత ప్రాధాన్యతలను ఆటోమేటిక్‌గా అమలు చేస్తుంది. 2026 మెగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్‌ను టెక్నో,ఎస్ప్రిట్ ఆల్పైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెనాల్ట్ వెల్లడించింది.

Advertisement