Hyundai Bayon: వెన్యూ, క్రెటా మధ్యలో నూతన ఎస్‌యూవీ.. హ్యుందాయ్ బేయాన్ వచ్చేస్తోంది!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లోకి తీసుకురానున్న కొత్త ఎస్‌యూవీ పేరును హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారికంగా ఖరారు చేసింది. ఈ కొత్త గ్లోబల్ ఎస్‌యూవీకి 'బేయాన్' (Bayon) అనే పేరును నిర్ణయించింది. తమ డిజైన్ ఫిలాసఫీతో పాటు టెక్నాలజీ ఆధారిత విధానాన్ని ఈ కొత్త ఎస్‌యూవీ ప్రతిబింబిస్తుందని కంపెనీ తెలిపింది. రాబోయే వారాల్లో ఈ వాహనానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఇటీవల హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో అమ్మకాలను పెంచుకుని తిరిగి రెండో స్థానాన్ని దక్కించుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా రెండు కొత్త ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
వివరాలు
వెన్యూ, క్రెటా మధ్యలో బేయాన్
వీటిలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం కాగా.. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు వెల్లడించారు.
కొత్త మోడల్‌తో పాటు ప్రస్తుతం ఉన్న క్రెటా EV, ఐయోనిక్ 5 మోడళ్ల కారణంగా వచ్చే ఏడాది నాటికి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాల వాటా పరిశ్రమ స్థాయిలో సుమారు 7 శాతానికి చేరుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీ.. కంపెనీ లైనప్‌లో వెన్యూ, క్రెటా మధ్య స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.
దీని పొడవు సుమారు 4.2 మీటర్లు ఉండొచ్చని అంచనా. పెట్రోల్, సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఈ ఎస్‌యూవీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
భారత రోడ్లపై ఇప్పటికే టెస్టింగ్
అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న 'బేయాన్' పేరునే భారత్‌లోనూ కొనసాగించనున్నప్పటికీ.. ఇండియా-స్పెక్ మోడల్ డిజైన్ మాత్రం స్థానిక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్తగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
హ్యుందాయ్ బేయాన్‌ను భారత రోడ్లపై పలుమార్లు టెస్టింగ్ చేశారు. సంప్రదాయంగా నిటారుగా ఉండే SUVడిజైన్‌కు బదులుగా క్రాసోవర్ తరహా డిజైన్‌ను ఈ వాహనం కలిగి ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్స్‌లో భాగంగా స్లీక్ LEDలైటింగ్, స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది.
ఇంటీరియర్‌కు సంబంధించి బయటకు వచ్చిన స్పై షాట్ల ప్రకారం.. కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, కర్వ్‌డ్ డ్యూయల్ స్క్రీన్స్, రీడిజైన్ చేసిన స్టీరింగ్ వీల్, లైట్ కలర్ క్యాబిన్ ట్రిమ్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.
వివరాలు
బేయాన్ పేరు వెనుక కథ ఇదే
టెస్టింగ్‌లో కనిపించిన వాహనాల్లో కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లకు సంబంధించిన సంకేతాలు కూడా కనిపించాయి.
'బేయాన్' అనే పేరు ఫ్రాన్స్‌లోని బాస్క్ ప్రాంతంలో ఉన్న బయోన్ (Bayonne) నగరం నుంచి స్ఫూర్తి పొందింది.
ప్రత్యేకమైన గుర్తింపు, ఉత్సాహభరితమైన స్వభావానికి పేరుగాంచిన ఈ నగరం పేరును హ్యుందాయ్ తన కొత్త SUVకి ఎంచుకుంది.
ఈ పేరు తమ గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబిస్తుందని హ్యుందాయ్ తెలిపింది.
భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని స్టైల్, టెక్నాలజీ, అడ్వెంచర్ అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఈ కొత్త SUVని తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.