LOADING...
Hyundai : చిన్నారి మృతి ఘటనతో అలర్ట్.. హ్యుందాయ్ పాలిసేడ్ వాహనాల రీకాల్!
చిన్నారి మృతి ఘటనతో అలర్ట్.. హ్యుందాయ్ పాలిసేడ్ వాహనాల రీకాల్!

Hyundai : చిన్నారి మృతి ఘటనతో అలర్ట్.. హ్యుందాయ్ పాలిసేడ్ వాహనాల రీకాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ అమెరికా, కెనడాలో విక్రయిస్తున్న కొన్ని హ్యుందాయ్ పాలిసాడ్ ఎస్‌యూవీల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. పవర్‌ సీట్లలో తలెత్తిన భద్రతా లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈసమస్యను పరిష్కరించేందుకు వాహనాలను రీకాల్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈచర్యకు నేపథ్యంగా అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మార్చి 7న జరిగిన విషాద ఘటన ఉందని తెలుస్తోంది. రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన అనంతరం ఈఅంశంపై విచారణ కొనసాగుతోంది. అయితే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని హ్యుందాయ్‌ సంస్థ పేర్కొంది. చిన్నారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని కూడా కంపెనీ వ్యక్తం చేసింది.

Details

68,500 వాహనాలు రీకాల్

ప్రస్తుతం 2026 మోడల్‌కు చెందిన పాలిసేడ్ లిమిటెడ్, క్యాలిగ్రఫీ ట్రిమ్‌ల విక్రయాలను నిలిపివేశారు. రెండో, మూడో వరుసల్లో ఉన్న పవర్‌ సీట్లు వ్యక్తులు లేదా వస్తువులు తగిలినా వాటిని సరైన విధంగా గుర్తించకపోవచ్చనే అనుమానాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ రీకాల్‌ ద్వారా మొత్తం సుమారు 68,500 వాహనాలు ప్రభావితమవుతున్నాయి. ఇందులో అమెరికాలో సుమారు 60,500 యూనిట్లు, కెనడాలో దాదాపు 8,000 వాహనాలు ఉన్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కంపెనీ చర్యలు చేపడుతోంది.

Details

ప్రత్యామ్నాయంగా అద్దె వాహనాలు

అంతవరకు తాత్కాలికంగా ఓవర్‌-ద-ఎయిర్‌ (OTA) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. మార్చి చివరి నాటికి ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపింది. దీని ద్వారా వస్తువులను మరింత వేగంగా గుర్తించే విధంగా వ్యవస్థను మెరుగుపరుస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభావిత వాహన యజమానులకు ప్రత్యామ్నాయంగా అద్దె వాహనాలను కూడా అందించనున్నట్లు తెలిపింది. రెండో, మూడో వరుస పవర్‌ సీట్లను ఉపయోగించే సమయంలో పిల్లలు లేదా ఇతర వస్తువులు సీటు వద్ద లేకుండా ముందుగా నిర్ధారించుకోవాలని హ్యుందాయ్‌ వినియోగదారులకు సూచించింది.

Advertisement