Page Loader
Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ
ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను రూపొందించింది. ఈ పాలసీని 2024-29 మధ్య అమలులో ఉంచే విధంగా రూపొందించారు. విద్యుత్ వాహనాల తయారీదారులకు, కొనుగోలుదారులకు వివిధ రాయితీలు ప్రకటించారు. ఎలక్ట్రిక్ బైకులు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లకు ఎక్స్‌షోరూమ్ ధరలో 5% రాయితీ కల్పించారు. ఆర్‌వీఎస్‌ఎస్ ఆపరేటర్‌ ద్వారా సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ తీసుకుంటే 10% రాయితీ పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాలు 2027 మార్చి వరకు వర్తిస్తాయి.

వివరాలు 

పాలసీలో ఎక్స్‌ షోరూమ్ ధరకు పరిమితులు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్డు ట్యాక్స్‌ మినహాయింపు వర్తిస్తాయి. కానీ, హైబ్రిడ్‌ నాలుగు చక్రాల వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదు. పాలసీలో ఎక్స్‌ షోరూమ్ ధరకు పరిమితులు కూడా విధించబడ్డాయి. బైకులకు గరిష్ఠంగా రూ.లక్ష, మూడు చక్రాల వాహనాలకు రూ.2 లక్షలు, విద్యుత్ బస్సుకు రూ.2 కోట్లు, సరకు రవాణా వాహనాలకు రూ.5 లక్షలు, ట్రాక్టర్లకు రూ.6 లక్షల వరకు రాయితీ వర్తిస్తుంది. మొదటి 5 వేల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25% (గరిష్ఠంగా రూ. 3 లక్షలు) రాయితీ కూడా ఉంటుంది. 2029 నాటికి 2 లక్షల విద్యుత్ బైకులను రిజిస్ట్రర్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

ఆర్టీసీలో 100% విద్యుత్ బస్సుల వినియోగాన్ని అందించేందుకు ప్రణాళికలు

అలాగే, 2029 నాటికి కనీసం 10 వేల మూడు చక్రాల వాహనాలు, 20 వేల కొత్త కార్లను తీసుకురావడం టార్గెట్ గా ఉంది. ఆర్టీసీలో 100% విద్యుత్ బస్సుల వినియోగాన్ని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి 30 కిలోమీటర్ల విభాగంలో ఒక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్‌ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు చేయబడుతున్నాయి. ఈ-మొబిలిటీ నగరాల నిర్మాణానికి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-మొబిలిటీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 100 ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటును ప్రస్తావించారు. అలాగే, విద్యుత్ వాహనాల తయారీదారులకు వివిధ రాయితీలు మరియు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. ఈవీ రంగంతో సంబంధిత భాగస్వామ్యుల అభిప్రాయాలను తీసుకుని పాలసీ విధానాలు రూపొందించారు.