BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. బిగ్ ఎంట్రీకి రెడీ అవుతున్న 'డెంజా'!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లోకి కొత్త కార్ల కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది మన దేశంలోకి రెండు కొత్త బ్రాండ్లు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం ఆటోమొబైల్ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో జెఎస్‌డబ్ల్యూ (JSW) రాక ఇప్పటికే ఖరారైంది. అంతేకాదు.. ఆ సంస్థ తన తొలి కారును కూడా దాదాపు సిద్ధం చేసింది. ఇక రెండో బ్రాండ్ విషయానికొస్తే.. అది చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడి (BYD)కి చెందిన హై-ఎండ్ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' (Denza). డెంజా బ్రాండ్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి బివైడి ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
వివరాలు
రూ.80 లక్షలకు పైనే డెంజా కార్లు
నిజానికి 2010లో బివైడి, ప్రముఖ దిగ్గజ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ కలిసి ఉమ్మడిగా డెంజా బ్రాండ్‌ను ప్రారంభించాయి.
అయితే ఆ తర్వాత ఈ భాగస్వామ్యం నుంచి మెర్సిడెస్ బెంజ్ తప్పుకుంది. దీంతో బివైడి ఈ బ్రాండ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది.
అనంతరం డెంజాను సూపర్ లగ్జరీ, ప్రామిసింగ్ హై-ఎండ్ బ్రాండ్‌గా తీర్చిదిద్దింది. భారతదేశంలో బివైడి ఇప్పటికే విక్రయిస్తున్న వాహనాల రేంజ్ కంటే పైన.. అంటే అత్యంత ఖరీదైన ప్రీమియం సెగ్మెంట్‌లో డెంజా కార్లను నిలబెట్టాలని కంపెనీ చూస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో బివైడి రూ.20 లక్షల నుంచి రూ.80 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తోంది. రూ.80 లక్షలకు మించిన లగ్జరీ సెగ్మెంట్‌ను డెంజా కార్లతో భర్తీ చేయాలని భావిస్తోంది.
వివరాలు
రెండు మోడళ్లు ఎంట్రీ
ఆటోకార్ ఇండియా సమాచారం ప్రకారం.. కంపెనీ ప్రారంభంలో రెండు డెంజా మోడళ్లను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది.
వాటిలో 'జెడ్9 జీటీ' (Z9 GT), 'డి9 లగ్జరీ ఎంపివి' (D9 Luxury MPV) ఉన్నాయి.
ఈ రెండు మోడళ్లను పూర్తి స్థాయిలో తయారు చేసిన కార్లుగా (CBU - Completely Built Up Unit) నేరుగా దిగుమతి చేసుకుని భారతదేశంలో విక్రయించనున్నారు.
వివరాలు
జెడ్9 జీటీ.. 1156 హెచ్‌పీ పవర్
డెంజా జెడ్9 జీటీ విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్‌లో ఈ కారు ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనే రెండు వెర్షన్లలో లభిస్తోంది.
అయితే భారత్‌లో మాత్రం కేవలం ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మాత్రమే తీసుకురానున్నారు. దాదాపు 2.9 టన్నుల బరువు ఉండే ఈ పవర్‌ఫుల్ ఈవీలో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.
ఇవి ఏకంగా 1156 హెచ్‌పీ (HP) మైండ్ బ్లోయింగ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా కూడా ఈ కారు ఆకట్టుకుంటుంది.
కేవలం 2.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
అంతేకాకుండా గంటకు 270 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఈ కారు.. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది.
వివరాలు
టొయోటా వెల్‌ఫైర్‌కు పోటీగా డి9
ఈ సూపర్ ఈవీ భారత మార్కెట్‌లో రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల భారీ బడ్జెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు డెంజా డి9 లగ్జరీ ఎంపివి (D9 Luxury MPV).. భారత మార్కెట్‌లోని టొయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire) వంటి అల్ట్రా-లగ్జరీ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఈ కారు రానుంది. దీని ధర దాదాపు రూ.80 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
డి9లో భారీ 103kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 2 + 2 + 3 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో ఈ రాజసమైన కారు రానుంది.
వివరాలు
అత్యాధునిక ఫీచర్లు
ప్రయాణికుల కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ఇందులో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఆడియో సిస్టమ్, ఫుల్ లెదర్ అపోల్స్టరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా మిడిల్ రో (మధ్య వరుస)లో కూర్చునే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఫోల్డ్-అవుట్ టేబుల్స్‌ను అందించారు.
రిలాక్స్ అవ్వడానికి ఎక్స్టెండబుల్ లెగ్ రెస్ట్‌లను కూడా అమర్చారు. సంపన్నులను, లగ్జరీ ఈవీలను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని డెంజా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.
ఈ బ్రాండ్ రాకతో దేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.