LOADING...
E20 Fuel : ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్‌లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ
ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్‌లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ

E20 Fuel : ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్‌లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ

వ్రాసిన వారు Moogati Shabari
Jun 19, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ఇంధనాల వైపు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎథనాల్ మిశ్రమ ఇంధనమైన E20 వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీనికి చాలా మంది మద్దతు తెలుపుతున్నప్పటికీ, ఈ ఇంధనం వాహనాలకు హానికరమంటూ సోషల్ మీడియాలో పలు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది. కారులోని ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ వద్ద చీమలు గుంపుగా కనిపించడాన్ని చూపిస్తూ, ట్యాంక్‌లో E20 ఇంధనం ఉండటమే దీనికి కారణమని ఆ వీడియోలో ప్రచారం చేశారు. అయితే ఈ వాదన పూర్తిగా తప్పుదారి పట్టించేదని భారత్ పెట్రోలియం స్పష్టం చేసింది.

వివరాలు

ఆ ప్రచారం నమ్మొద్దు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కారు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ చుట్టూ చీమలు గుంపుగా కనిపిస్తున్నాయి. అయితే వీడియోలో మొత్తం కారు కనిపించదు. ఫ్యూయల్ క్యాప్‌పై ఉన్న E20 స్టిక్కర్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఆ వాహనం ఎథనాల్ మిశ్రమ ఇంధనానికి అనుకూలమైనదని తెలుస్తోంది. వీడియో ప్రచారంపై స్పందించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సోషల్ మీడియాలో వస్తున్న వాదనలను పరిశీలించినట్లు తెలిపింది. వాహనాల ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్‌ల వద్ద చీమలు చేరడం, దానికి E20 పెట్రోల్ కారణమనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

వివరాలు

భారత్ పెట్రోలియం ఏం చెప్పిందంటే..

పెట్రోల్‌లో కలిపే ఫ్యూయల్ గ్రేడ్ ఎథనాల్‌ను కిణ్వ ప్రక్రియ (Fermentation), స్వేదన (Distillation) ద్వారా తయారు చేస్తారని BPCL తెలిపింది. ఈ ప్రక్రియలో చివరి ఉత్పత్తిలో మిగిలిపోయే చక్కెర పదార్థాలు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొంది. అలాగే ఫ్యూయల్ ఎథనాల్‌లో ఉండే డీనేచురెంట్లు (Denaturants) కీటకాలను దూరంగా ఉంచే లక్షణాలు కలిగి ఉంటాయని వెల్లడించింది. ఎథనాల్‌ను పెట్రోల్‌తో కలిపిన తర్వాత కూడా పెట్రోల్‌కు ఉండే హైడ్రోకార్బన్ వాసనే ప్రధానంగా ఉంటుందని, ఎథనాల్‌కు సంబంధించిన ప్రత్యేక వాసన దాదాపు గుర్తించలేమని BPCL వివరించింది. అంతేకాకుండా, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌లో ఇంధన ఆవిరి కూడా తక్కువగా ఏర్పడుతుందని తెలిపింది.

Advertisement

వివరాలు

ఎలాంటి శాస్త్రీయ సాక్ష్యాలు లేవని స్పష్టం..

అందువల్ల E20 ఇంధనంలో చీమలు లేదా ఇతర కీటకాలను ఆకర్షించే ఎలాంటి లక్షణాలు లేవని BPCL స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్లే ఫ్యూయల్ క్యాప్ వద్ద చీమలు చేరతాయనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని, దీనికి ఎలాంటి శాస్త్రీయ సాక్ష్యాలు లేవని భారత్ పెట్రోలియం తేల్చిచెప్పింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement