EV Charging Stations : ఏపీఎస్‌పీడీసీఎల్ నిర్ణయం.. రాష్ట్రంలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) తన పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. సంస్థ పరిధిలోని 162 ప్రాంతాల్లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ఛార్జింగ్ కేంద్రాల్లో 13 కిలోవాట్ సామర్థ్యంతో లైట్ ఈవీ ఏసీ/డీసీ ఛార్జర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోథేటి వెల్లడించారు. ఇవి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించడం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
Details
అజయ్ మాథుర్‌తో సీఎండీ శివ శంకర్ వర్చువల్ సమావేశం
క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ పీఎం-కుసుమ్ 2.0 పథకం కింద ఫీడర్ స్థాయి సోలరైజేషన్‌కు కూడా ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. 2026-27 నుంచి 2029-30 వరకు ప్రతి సంవత్సరం 550 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి, మొత్తం 2,200 మెగావాట్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అదనంగా 500 మెగావాట్లు / 1000 మెగావాట్ గంటల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) తొలి దశలో అమలులో ఉందని అధికారులు తెలిపారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, భవిష్యత్ వ్యూహాలపై సమీక్షించేందుకు ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా ఉన్న, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్‌తో సీఎండీ శివ శంకర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
Details
4.36 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు
ఈ సమావేశంలో డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్యతో పాటు సంస్థకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే తొలి నెట్-జీరో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని కూడా సీఎండీ ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7,489 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు లాభం చేకూరేలా 4.36 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Details
39.75 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు
అదేవిధంగా 48,000 గృహాలను కవర్ చేసేలా 39.75 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 50 మెగావాట్లు / 100 మెగావాట్ల సామర్థ్యంతో బీఈఎస్‌ఎస్ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేయనున్నారు. విద్యుత్ పంపిణీ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించే దిశగా ఏపీఎస్‌పీడీసీఎల్ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL), రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌లతో కలిసి పనిచేస్తోంది.