LOADING...
ARAI: భారత్‌లో తొలి Euro NCAP ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్ పూర్తి చేసిన ARAI
భారత్‌లో తొలి Euro NCAP ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్ పూర్తి చేసిన ARAI

ARAI: భారత్‌లో తొలి Euro NCAP ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్ పూర్తి చేసిన ARAI

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ భద్రతా పరీక్షల రంగంలో కీలక ముందడుగు పడింది. పుణేకు చెందిన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI)దేశంలోనే తొలి Euro NCAP 2026ప్రమాణాలకు అనుగుణమైన ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కొత్త సదుపాయంతో ARAI ఇప్పుడు అన్ని రకాల Euro NCAP స్లెడ్ టెస్ట్ మూల్యాంకనాలను ఒకేచోట నిర్వహించే సామర్థ్యాన్ని సాధించింది. వాహనం సైడ్ నుంచి ఢీకొన్నప్పుడు ప్రయాణికులు వాహనం మరో వైపు కదిలే పరిస్థితుల్లో భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఈ ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్ ఉపయోగపడుతుంది. తీవ్రమైన సైడ్ ఇంపాక్ట్ ప్రమాదాల్లో గాయాలను తగ్గించేందుకు రూపొందించిన Euro NCAP 2026 సేఫ్టీ ప్రోటోకాల్‌లో ఈ పరీక్ష కీలక భాగంగా ఉంది.

వివరాలు 

భారత్‌లోనే ఈ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం

ARAI తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం సంస్థ Knee Mapping, Vehicle Test Configuration (VTC), Whiplash, Far-Side వంటి అన్ని ప్రధాన NCAP స్లెడ్ టెస్టులను నిర్వహించే పూర్తి సదుపాయాలను కలిగి ఉంది. నియంత్రిత క్రాష్ సిమ్యులేషన్ల ద్వారా వాహన భద్రతా వ్యవస్థలు నిజ జీవిత ప్రమాదాల్లో ఎలా స్పందిస్తాయో ఈ పరీక్షల్లో పరిశీలిస్తారు. ప్రత్యేకంగా ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్‌లో సీట్లు, సీట్‌బెల్ట్లు, ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణికుల రక్షణ వ్యవస్థల పనితీరును అంచనా వేస్తారు. ఆధునిక కార్లలో సెంటర్ ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ సీట్ డిజైన్లు ప్రయాణికుల భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటివరకు విదేశీ టెస్టింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సి వచ్చిన తయారీ సంస్థలు ఇకపై భారత్‌లోనే ఈ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లభించనుంది.

వివరాలు 

సిమ్యులేషన్, వాలిడేషన్,ఫిజికల్ టెస్టింగ్ అన్నీ ఒకేచోటే

'డిజైన్ అండ్ వాలిడేట్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఈ విజయంతో మరింత బలం చేకూరుతుందని ARAI పేర్కొంది. భారత్‌లోనే Euro NCAP 2026 ఫార్-సైడ్ స్లెడ్ టెస్ట్ సదుపాయం అందుబాటులోకి రావడంతో దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం వాహనాల అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు ఖర్చులు,టెస్టింగ్ సమయం కూడా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇక ARAI వద్ద ఉన్న కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజినీరింగ్(CAE)సదుపాయాల ద్వారా సిమ్యులేషన్, వాలిడేషన్,ఫిజికల్ టెస్టింగ్ అన్నీ ఒకేచోటే నిర్వహించవచ్చని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాహన భద్రతా ప్రమాణాలు కఠినమవుతున్నసమయంలో ARAI తీసుకొచ్చిన ఈ కొత్త సదుపాయం భారత ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊతమివ్వనుంది. భవిష్యత్ వాహనాలను అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయడంలో ఇది ఆటోమేకర్లకు సహాయపడనుంది.

Advertisement