Loading...
India Auto Sales: సెప్టెంబర్‌లో దుమ్మురేపిన ఆటో సేల్స్‌.. 25.36 లక్షల వాహనాల విక్రయం!
సెప్టెంబర్‌లో దుమ్మురేపిన ఆటో సేల్స్‌.. 25.36 లక్షల వాహనాల విక్రయం!

India Auto Sales: సెప్టెంబర్‌లో దుమ్మురేపిన ఆటో సేల్స్‌.. 25.36 లక్షల వాహనాల విక్రయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్‌ రంగం సెప్టెంబర్‌ నెలలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి వాహనాలకు బలమైన డిమాండ్‌ కనిపించింది. దీంతో దేశీయ ఆటోమొబైల్‌ రిటైల్‌ అమ్మకాలు రికార్డు స్థాయిలో 25,36,920 యూనిట్లకు చేరాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 31.82 శాతం అధికం కావడం విశేషం. 'ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (FADA)' తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ వివరాలను వెల్లడించింది. ఆగస్టు నెలతో పోల్చినా సెప్టెంబర్‌లో ఆటో రిటైల్‌ అమ్మకాలు 4.69 శాతం పెరిగాయి. భారత ఆటో పరిశ్రమ చరిత్రలో ఒకే నెలలో, ముఖ్యంగా సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని FADA తెలిపింది.

వివరాలు

అమ్మకాలు తక్కువగా నమోదు

అయితే ఈ 31.82 శాతం వార్షిక వృద్ధిని కొంత జాగ్రత్తగా చూడాలని హెచ్చరించింది.

గతేడాది సెప్టెంబర్‌ 2025లో జీఎస్టీ 2.0 అమలు కానుందన్న ఊహాగానాలు నెలకొనడంతో చాలామంది వినియోగదారులు వాహనాల కొనుగోలును వాయిదా వేశారు.

దీంతో ఆ సమయంలో అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. ఈ 'లో-బేస్‌ ఎఫెక్ట్‌' కారణంగానే ఈ ఏడాది వృద్ధి శాతం భారీగా కనిపిస్తోందని FADA ప్రెసిడెంట్‌ సాయి గిరిధర్‌ తెలిపారు.

వాస్తవానికి 2027 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో అంటే ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య మొత్తం వాహనాల అమ్మకాలు 1,55,12,319 యూనిట్లకు చేరడం ముఖ్యమైన మైలురాయని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

అన్ని కేటగిరీల్లోనూ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20.77 శాతం వృద్ధి అని వెల్లడించారు. విభాగాల వారీగా పరిశీలిస్తే దాదాపు అన్ని కేటగిరీల్లోనూ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

ద్విచక్ర వాహనాలు 33.08 శాతం వృద్ధితో 17,90,188 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్‌ వాహనాలు (కార్లు) 32.10 శాతం పెరుగుదలతో 4,27,213 యూనిట్ల విక్రయాలు నమోదు చేశాయి.

వాణిజ్య వాహనాలు 37.62 శాతం వృద్ధితో 1,03,557 యూనిట్లు అమ్ముడయ్యాయి.

సెప్టెంబర్‌ నెలలో ఈ విభాగం లక్ష యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి.

అదేవిధంగా త్రిచక్ర వాహనాలు 22.25 శాతం వృద్ధితో 1,32,570 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్లు 13.75 శాతం పెరుగుదలతో 76,906 యూనిట్లు విక్రయమయ్యాయి.

ADVERTISEMENT

వివరాలు

ఇంధన వాహనాల వాటా 41 శాతం

ప్యాసింజర్‌ వాహనాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా 41 శాతానికి చేరింది. ఇది పెట్రోల్‌ వాహనాల వాటా 41.27 శాతానికి దాదాపు సమానంగా ఉంది.

ఇదే విభాగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 8.45 శాతానికి పెరిగింది. అన్ని కేటగిరీలను కలిపి చూస్తే మొత్తం ఈవీ రిటైల్‌ అమ్మకాలు ఆల్‌టైమ్‌ నెలవారీ గరిష్ఠానికి చేరాయి. సెప్టెంబర్‌లో ఏకంగా 3.34 లక్షల ఈవీలు విక్రయమయ్యాయి.

దీంతో మొత్తం వాహన అమ్మకాల్లో ఈవీల వాటా సుమారు 13 శాతానికి చేరుకుంది. రాబోయే పండుగ సీజన్‌పై డీలర్లు పూర్తి ఆశాభావంతో ఉన్నారు.

ప్రస్తుతం పితృపక్షం కారణంగా వాహనాల కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వారు.. నవరాత్రులు, దసరా పండుగల సందర్భంగా కొనుగోళ్లు జరుపుతారని డీలర్లు భావిస్తున్నారు.

ADVERTISEMENT