LOADING...
Bajaj Pulsar 180 : బజాజ్ పల్సర్ 180 రీ-ఎంట్రీ.. కొత్త లుక్, లేటెస్ట్ ఫీచర్లతో అదుర్స్
బజాజ్ పల్సర్ 180 రీ-ఎంట్రీ.. కొత్త లుక్, లేటెస్ట్ ఫీచర్లతో అదుర్స్

Bajaj Pulsar 180 : బజాజ్ పల్సర్ 180 రీ-ఎంట్రీ.. కొత్త లుక్, లేటెస్ట్ ఫీచర్లతో అదుర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కాకముందే, రాబోయే బజాబ్ పల్సర్ 180 ఒక డీలర్‌షిప్ వద్ద కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. బజాబ్ ఆటో బ్రాండ్‌లో అత్యంత ఐకానిక్ బైక్‌లలో ఒకటైన ఈ మోడల్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోందని ఇది స్పష్టమైన సంకేతంగా మారింది. ఒకప్పుడు బజాజ్ లైనప్‌లో కీలక స్థానం దక్కించుకున్న పల్సర్ 180, ఇప్పుడు అప్‌డేట్ చేసిన స్టైలింగ్, ఆధునిక ఫీచర్లు, అలాగే పాత పరిచిత స్వభావంతో తిరిగి రానుంది. ఈ పరిణామం చూస్తుంటే, 180 సీసీ విభాగంలో బజాజ్ తన క్లాసిక్ పల్సర్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

డిజైన్, స్టైలింగ్ ఇలా..

డీలర్‌షిప్‌లో కనిపించిన ఈ కొత్త పల్సర్ 180, తాజా 'క్లాసిక్ పల్సర్' డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరించింది. ఇటీవల అప్‌డేట్ అయిన పల్సర్ 150 నుంచి కొన్ని డిజైన్ ఎలిమెంట్స్‌ను తీసుకుంది. బ్లాక్ కలర్‌పై రెడ్, గ్రే గ్రాఫిక్స్‌తో ఆకట్టుకునే ఫినిషింగ్ కనిపిస్తోంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్పోర్టీ సైడ్ ప్యానెల్స్, షార్ప్ టెయిల్ సెక్షన్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టెయిల్‌పై ఉన్న "180" డెకాల్ మోడల్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.

వివరాలు

ప్రధాన అప్‌డేట్లు..

ఈ బైక్‌లో ప్రధాన మార్పుగా కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను అందించారు. ఇది పాత మోడల్ కంటే మరింత షార్ప్, ప్రీమియం లుక్ ఇస్తోంది. అదేవిధంగా, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లు కూడా జతచేశారు. ఫుల్ డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరో ముఖ్యమైన అప్‌డేట్. టాప్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

నిర్మాణశైలి..

డీలర్‌షిప్‌లో కనిపించిన మోడల్‌ను గమనిస్తే, ఇందులో వెనుక డిస్క్ బ్రేకులు, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. నలుపు రంగులో ఉన్న పెద్ద ఎగ్జాస్ట్ (సైలెన్సర్) బైక్‌కు మరింత మస్క్యులర్ లుక్ ఇస్తోంది. ఈ ఎగ్జాస్ట్ డిజైన్ బజాబ్ పల్సర్ 220Fను తలపిస్తోంది, దీనివల్ల స్పోర్టీ ఫీలింగ్ మరింత పెరిగింది. ఇంజిన్ సామర్థ్యం.. మెకానికల్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 178.6 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. తాజా ఉద్గార ప్రమాణాలు, ఈ20 ఇంధనానికి అనుగుణంగా దీనిని అప్‌డేట్ చేశారు. పాత మోడల్ 17 హెచ్‌పీ పవర్, 14.2 ఎన్‌ఎం టార్క్‌ను ఇచ్చేది. కొత్త మోడల్‌లో కూడా దాదాపు ఇదే స్థాయి పనితీరు ఉండొచ్చు. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేయనున్నారు.

Advertisement

వివరాలు

మార్కెట్ అంచనాలు

బజాబ్ పల్సర్ 180 త్వరలోనే భారత మార్కెట్‌లో లాంచ్ కానుంది. దీని ధర పల్సర్ 150, పల్సర్ 220ఎఫ్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ రీ-ఎంట్రీతో టీవీఎస్ అపాచ్ ఆర్‌టీఆర్ 180 వంటి ప్రత్యర్థులకు బజాజ్ గట్టి పోటీ ఇవ్వనుంది. 'ఎన్-సిరీస్' కంటే క్లాసిక్ పల్సర్ డిజైన్‌ను ఇష్టపడే వినియోగదారులను ఈ మోడల్ ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు బైక్‌లు చేరుతున్న నేపథ్యంలో, అధికారిక ధరల ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

Advertisement