Bajaj Pulsar NS400Z: కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్.. పాత ధరకే మార్కెట్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాబ్ ఆటో తన పల్సర్ సిరీస్‌లో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. కొత్తగా బజాజ్ పల్సర్ NS400Z మోడల్‌ను 350సీసీ ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో ఉన్న 373cc ఇంజిన్ స్థానంలో ఇప్పుడు కొత్త యూనిట్‌ను అందించారు. ఆసక్తికరంగా ఇంజిన్‌ను అప్‌డేట్ చేసినప్పటికీ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
వివరాలు
కొత్త ఇంజిన్ ప్రత్యేకతలు
ఈ బైక్‌లో అమర్చిన కొత్త ఇంజిన్ 349.13సీసీ సామర్థ్యంతో వస్తోంది. ఇది 9,000 ఆర్పీఎమ్ వద్ద 40 బీహెచ్‌పీ శక్తిని, 7,500 ఆర్పీఎమ్ వద్ద 33.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది . పాత ఇంజిన్‌తో పోలిస్తే పవర్ స్వల్పంగా తగ్గినప్పటికీ, రోజువారీ వినియోగానికి అనువుగా మరింత స్మూత్ రైడింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మార్పుతో పన్నుల పరంగా ప్రయోజనాలు లభించడంతో పాటు ఇంధన సామర్థ్యం కూడా మెరుగవుతుందని పేర్కొంది. భవిష్యత్తులో రాబోయే బజాజ్ డొమినార్ 400 మోడల్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.
వివరాలు
డిజైన్, ఫీచర్లు యథాతథం
ఇంజిన్ మార్పు చేసినప్పటికీ బైక్ డిజైన్, స్టైలింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మస్కులర్ స్టాన్స్, షార్ప్ బాడీ ప్యానెల్స్‌తో కూడిన అగ్రెసివ్ స్ట్రీట్‌ఫైటర్ లుక్‌ను కొనసాగించారు. ఫీచర్ల పరంగా ఇందులో పెరిమీటర్ ఫ్రేమ్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, మల్టిపుల్ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.
వివరాలు
ధర వివరాలు
అత్యంత ముఖ్యంగా, కొత్త ఇంజిన్‌తో అప్‌డేట్ చేసినప్పటికీ ధరను పెంచలేదు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.93 లక్షలుగా ఉంది. ఈ ధరతో తన సెగ్మెంట్‌లో అత్యంత విలువైన పెర్ఫార్మెన్స్ బైక్‌లలో ఒకటిగా ఇది నిలుస్తోంది. మొత్తంగా, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు స్థిరమైన ధరతో బజాజ్ పల్సర్ NS400Z యువ రైడర్లకు మంచి ఎంపికగా కొనసాగుతోంది.