Bajaj reintroduces Pulsar 180: మళ్లీ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 .. ధర ఎంతంటే
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ప్రసిద్ధ మోడల్ పల్సర్ 180ను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బైక్ ధర ఢిల్లీలో ఎక్స్-షోరూమ్‌గా రూ.1.22 లక్షలుగా నిర్ణయించారు. పల్సర్ 150, పల్సర్ 220ఎఫ్ మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేలా ఈ మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ కొత్త పల్సర్ 180లో 178.6 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎంలో 17 హెచ్‌పీ పవర్, 6,500 ఆర్పీఎంలో 15 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
ఫీచర్లు ఇవే..
ఈ బైక్‌కు ఐదు స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. 2022లో నిలిపివేసిన మోడల్‌తో పోలిస్తే పవర్ అదే ఉన్నప్పటికీ టార్క్ మెరుగుపడింది. పల్సర్ 150తో పోలిస్తే 3 హెచ్‌పీ ఎక్కువ పవర్, 1.75 ఎన్ఎం ఎక్కువ టార్క్ ఇస్తుంది. ఇంకా ఈ బైక్‌లో ముందు (280 మిమీ), వెనుక (230 మిమీ) డిస్క్ బ్రేక్‌లకు ఏబీఎస్ సపోర్ట్ ఉంది. 17 అంగుళాల స్పోర్టీ వీల్స్‌పై ట్యూబ్‌లెస్ టైర్లు, 15 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
5 రంగుల్లో అందుబాటులోకి..
పల్సర్ 180లో నెగటివ్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. బ్లాక్-గోల్డ్, బ్లాక్-బ్లూ, బ్లాక్-గ్రే, బ్లాక్-రెడ్, వైట్ వంటి ఐదు రంగుల్లో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. పల్సర్ 150తో పోలిస్తే రూ.12,000 ఎక్కువ ధర ఉన్నప్పటికీ, ప్రధాన ప్రత్యర్థి కంటే సుమారు రూ.4,000 తక్కువగా ఉంది. ఈ బైక్ మార్కెట్లోకి వస్తే బజార్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.