BYD: కేవలం 9 నిమిషాల్లో 100% ఛార్జ్.. BYD కొత్త బ్యాటరీ టెక్నాలజీ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
చైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తాజాగా కొత్త బ్యాటరీ టెక్నాలజీని పరిచయం చేసింది. కంపెనీ రూపొందించిన బ్లేడ్ బ్యాటరీ 2.0 సిస్టమ్ కేవలం కొన్ని నిమిషాల్లోనే వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేయగలదని వెల్లడించింది. ఈ కొత్త బ్యాటరీతో కేవలం 5 నిమిషాల్లో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, మరో 4 నిమిషాల్లోనే 100 శాతం వరకు ఛార్జ్ పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. తీవ్రమైన చలిలో కూడా ఈ బ్యాటరీ మంచి పనితీరు చూపుతుందని BYD పేర్కొంది. మైనస్ 20డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా 20శాతం నుంచి దాదాపు 97 శాతం వరకు 12 నిమిషాల లోపే ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
యాంగ్‌వాంగ్ U7 లగ్జరీ సెడాన్ కారులో కొత్త బ్లేడ్ బ్యాటరీ 2.0 సిస్టమ్
ఈ కొత్త బ్లేడ్ బ్యాటరీ 2.0 సిస్టమ్ మొదటిగా యాంగ్‌వాంగ్ U7 అనే లగ్జరీ సెడాన్ కారులో అందుబాటులోకి రానుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వేగమైన ఛార్జింగ్ సాధ్యమవ్వాలంటే BYD ప్రత్యేకంగా రూపొందించిన "ఫ్లాష్ ఛార్జింగ్ EV ఛార్జర్లు" ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఛార్జర్లు సుమారు 1.5 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఈ టెక్నాలజీ ఎంతో ఆధునికమైనదైనా, దీని పూర్తి ప్రయోజనం పొందాలంటే BYD ఏర్పాటు చేసే ప్రత్యేక ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి.
వివరాలు
ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీదారుగా BYD
ఇక మార్కెట్‌లో BYDకి పోటీ కూడా గట్టిగానే ఉంది. లి ఆటో,ఎక్స్‌పెంగ్,షియోమీ,జీకర్ వంటి చైనా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో వేగంగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీదారుగా ఉన్న BYDకి కూడా ఈ పోటీ ప్రభావం పడుతోంది. 2026 జనవరి,ఫిబ్రవరి నెలల్లో కంపెనీ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 36శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్లేడ్ బ్యాటరీ 2.0లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్(LFP)కెమిస్ట్రీని ఉపయోగించారు.ఇందులో ఖరీదైన కోబాల్ట్ లేదా నికెల్ వంటి లోహాలు అవసరం ఉండవు, అందువల్ల ఇది ఇతర బ్యాటరీల కంటే తక్కువ ఖర్చుతో తయారవుతుంది. ప్రస్తుతం అనేక కంపెనీలు ఉపయోగిస్తున్న నికెల్-మ్యాంగనీస్-కోబాల్ట్ (NMC)బ్యాటరీలతో పోలిస్తే LFP బ్యాటరీలు కొంత తక్కువ ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉంటాయి.
వివరాలు
చైనా అంతటా 20,000కు పైగా ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లు..
అందుకే పశ్చిమ దేశాల కార్ల తయారీ సంస్థలు ఈ బ్యాటరీలను ఎక్కువగా తక్కువ ధర మోడళ్లలోనే ఉపయోగిస్తున్నాయి. ఇక ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతుగా చైనా అంతటా 20,000కు పైగా ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని BYD లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కంపెనీ హాన్ L సెడాన్ కోసం 1 మెగావాట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇప్పటికే 4,200 ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్టేషన్లలో పైభాగంలో ప్రత్యేక టవర్స్ ఉండి, వాటి నుంచి కేబుల్స్ కిందికి వేలాడుతూ ఉంటాయి. దీంతో కార్లను సులభంగా ప్లగ్ చేయవచ్చు. అలాగే విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గించేలా కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.