BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించింది. నిషేధం జనవరి 12 వరకు అమలులో ఉంటుంది, కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పొడిగించే అవకాశం ఉంది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 115, గ్రేడెడ్ రెస్పాన్స్ GRAP ఆదేశాల ప్రకారం ఈ నిషేధం విధించింది. GRAP అంటే ఢిల్లీ-NCR ప్రాంతంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత గాలి నాణ్యత క్షీణతను నివారించడానికి పనిచేసే అత్యవసర చర్యల సమితి. ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం, పోలీసు వాహనాలు, అత్యవసర సేవల్లో మోహరించిన వాహనాలు, అమలు కోసం ఉపయోగించే ప్రభుత్వ వాహనాలకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంది.
నిబంధనలు ఉల్లంఘించినవారు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది
నిషేధం అమలులో ఉన్న సమయంలో మిగిలిన వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194 (1) కింద వారు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 201-300 మధ్య గాలి నాణ్యత ఉంటే సూచికని (AQI) 'తక్కువ'గా, 301-400 'చాలా పేలవంగా', 401-500 'తీవ్రమైనది'గా గుర్తిస్తారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 24 గంటల సగటు AQI 371 ఉంటే , సోమవారానికి 434కి పెరిగింది. తీవ్రమైన చలిగాలులు, ఉష్ణోగ్రతలో రికార్డు స్థాయిలో పడిపోతున్న సమయంలో భారీ పొగమంచు దేశ రాజధానిని కప్పేసింది. ఈ నాలుగు చక్రాల వాహనాలను అదుపు చేయకుండా వదిలేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారనుంది.