LOADING...
Bharat Taxis: ఉబర్‌,ఓలాకు ప్రత్యామ్నాయంగా 'భారత్‌ ట్యాక్సీ'.. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం
జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం

Bharat Taxis: ఉబర్‌,ఓలాకు ప్రత్యామ్నాయంగా 'భారత్‌ ట్యాక్సీ'.. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉబర్‌, ఓలా, రాపిడో వంటి ప్రైవేట్‌ క్యాబ్‌ సంస్థలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార విధానంలో క్యాబ్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. 'భారత్‌ ట్యాక్సీ' అనే పేరుతో అందుబాటులోకి రానున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. తొలి దశలో దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 నుంచి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అనంతరం ఈ యాప్‌ ఆధారిత రవాణా సేవలను దేశమంతటా విస్తరించనున్నారు. భారత్‌ ట్యాక్సీ సేవలలో ఆటో, క్యాబ్‌, బైక్‌ రైడ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

భారత్‌ ట్యాక్సీ యాప్‌లో నమోదు చేసుకున్న 56 వేల మంది డ్రైవర్లు

ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉండనుంది. వినియోగదారులు తమ మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకుని సేవలను పొందవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న క్యాబ్‌ చార్జీలతో పోలిస్తే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా,ఎలాంటి సర్వీస్‌ ఛార్జీలు లేకుండానే రైడ్‌లు అందించే విధంగా ఈ సేవలను రూపొందించారు. ఇప్పటికే సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్‌ ట్యాక్సీ యాప్‌లో నమోదు చేసుకున్నారని కేంద్రం తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వచ్చే రైడ్‌ ఆదాయాన్ని పూర్తిగా (100 శాతం) డ్రైవర్లకే చెల్లించనున్నారు. చాలా తక్కువ నామమాత్ర రుసుముతో డ్రైవర్లు ఈ సహకార ప్లాట్‌ఫాంలో సేవలందించవచ్చు.

Advertisement