Nitin Gadkari: ఇ-20 ఇంధనంతో బీఎస్-3 వాహనాలకు రబ్బరు భాగాల మార్పు అవసరం: గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో 2016కు ముందు తయారైన బీఎస్-3 వాహనాలను ఇ-20 ఇంధనం (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోలు)తో నడిపితే,వాటిలోని కొన్ని రబ్బరు భాగాలు,గాస్కెట్లు మార్చాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇంజిన్‌లో ప్రత్యేక మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇ-20 ఇంధనం వాడితే వాహనాల మైలేజీ తగ్గుతుందన్న ఆందోళనలపై స్పందించిన మంత్రి, మైలేజీపై కేవలం ఇంధనం మాత్రమే కాకుండా వాహనం పరిస్థితి, నిర్వహణ, డ్రైవింగ్ విధానం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని తెలిపారు.
వివరాలు
ఇ-20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదు
ఈ విషయాన్ని వాహన తయారీ సంస్థలు, అలాగే వాహనాలు, ఇంజిన్ల పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా నిర్ధారించాయని చెప్పారు.
ద్విచక్ర వాహనాలు, కార్లపై ఇ-20 ఇంధనం ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) డెహ్రాడూన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) సంయుక్తంగా అధ్యయనం నిర్వహించినట్లు గడ్కరీ తెలిపారు.
ఆ అధ్యయనంలో ఇ-20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని తేలిందని మంత్రి పేర్కొన్నారు.
అలాగే పాత వాహనాల్లో డ్రైవబిలిటీ, స్టార్టబిలిటీ, మెటల్ కంపాటబిలిటీ, ప్లాస్టిక్ కంపాటబిలిటీ వంటి ప్రమాణాల్లో కూడా ఎలాంటి సమస్యలు కనిపించలేదని వెల్లడించారు.
వివరాలు
హైడ్రోజన్ వాహనాల కోసం 13 పైలట్ ప్రాజెక్టులకు ఆమోదం
అయితే, బీఎస్-3 వాహనాలపై నిర్వహించిన పరీక్షల్లో కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లు మాత్రమే మార్పు చేయాల్సి రావచ్చని గుర్తించినట్లు చెప్పారు.
ఈ భాగాలను సాధారణ సర్వీసింగ్ సమయంలోనే సులభంగా మార్చుకోవచ్చని మంత్రి వివరించారు.
జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ (ఎన్‌జీహెచ్‌ఎం) కింద హైడ్రోజన్ ఆధారిత రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 13 పైలట్ ప్రాజెక్టులను ఆమోదించినట్లు కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ లోక్‌సభకు తెలిపారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 70 హైడ్రోజన్ ఆధారిత వాహనాలను ప్రవేశపెట్టనున్నారు.
ఇందులో ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్‌సీఈవీలు), హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (హెచ్‌ఐసీఈ) సాంకేతికతతో నడిచే 27 బస్సులు, 43 ట్రక్కులు ఉంటాయని వెల్లడించారు.
వివరాలు
హైడ్రోజన్ వాహనాల కోసం 13 పైలట్ ప్రాజెక్టులకు ఆమోదం
అదే విధంగా, వివిధ రాష్ట్రాల్లోని 21 మార్గాల్లో 16 హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం కూడా ఈ పైలట్ ప్రాజెక్టుల్లో భాగంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టుల అమలుకు మొత్తం రూ.410.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్రం కేటాయించగా, ఇప్పటికే రూ.41.582 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.
ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్-ఐఓసీఎల్, ఆర్‌ఐఎల్-ఏఎల్, హెచ్‌పీసీఎల్-వోల్వో, ఎన్‌టీపీసీ-జీఈఎల్ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఈ పైలట్ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు.