E20 Fuel: E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గిందా? సర్వేలో ఆందోళనకర వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎథనాల్ మిశ్రమంతో కూడిన E20 పెట్రోల్ వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖ సామాజిక వేదిక LocalCircles నిర్వహించిన తాజా సర్వేలో 2023కు ముందు కొనుగోలు చేసిన పెట్రోల్ కార్ల యజమానుల్లో అధిక శాతం మంది తమ వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. 2025 ప్రారంభం నుంచి తమ కార్ల మైలేజ్ కనీసం 10 శాతానికి పైగా పడిపోయిందని 67 శాతం మంది వెల్లడించగా, దాదాపు నాలుగో వంతు మంది 20 శాతానికి మించిన తగ్గుదల నమోదైందని తెలిపారు. ఈ పరిణామం E20 పెట్రోల్‌పై ఉన్న సందేహాలను మరింత పెంచుతోంది.
వివరాలు
మైలేజ్ తగ్గడం, వాహనాల నిర్వహణ సమస్యలు
మైలేజ్ తగ్గడమే కాకుండా వాహనాల నిర్వహణ సమస్యలు కూడా పెరిగినట్లు సర్వే వెల్లడించింది.
2025 ప్రారంభం నుంచి ఇంజిన్, ఫ్యూయల్ లైన్, ఫ్యూయల్ పంప్,ఇంజెక్టర్లు,ఫ్యూయల్ ట్యాంక్ వంటి భాగాల్లో అసాధారణ స్థాయిలో మరమ్మతులు లేదా అరిగిపోవడం కనిపించిందని 45శాతం మంది తెలిపారు.
మే 2026లో ఇదే అంశంపై జరిగిన సర్వేలో ఈ సంఖ్య 29 శాతం మాత్రమే ఉండగా, తాజా సర్వేలో గణనీయంగా పెరగడం గమనార్హం.
ఈ ప్రభావం కేవలం పాత కార్లకే పరిమితం కాలేదని మరో అధ్యయనం వెల్లడించింది.
2023, 2024లో కొనుగోలు చేసిన E20 అనుకూల పెట్రోల్ కార్ల యజమానులు 22వేల మందికిపైగా పాల్గొన్న సర్వేలో 59శాతం మంది తమ వాహనాల మైలేజ్ 10శాతానికి మించి తగ్గిందని చెప్పారు.
వివరాలు
మైలేజ్ తగ్గుదల ప్రభుత్వం గతంలో అంచనా వేసిన స్థాయికంటే ఎక్కువగా ఉంది
వీరిలో దాదాపు నాలుగో వంతు మంది 20 శాతానికి మించిన తగ్గుదల నమోదైందని వెల్లడించారు.
E20కు అనుకూలంగా రూపొందించామని తయారీ సంస్థలు పేర్కొన్న కార్లలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది.
సర్వేలో నమోదైన మైలేజ్ తగ్గుదల ప్రభుత్వం గతంలో అంచనా వేసిన స్థాయికంటే ఎక్కువగా ఉండటంతో, కేవలం ఎథనాల్ మిశ్రమమే కాకుండా ఇంధన నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెట్రోల్‌లో అనుమతించిన 20 శాతం కంటే ఎక్కువ ఎథనాల్ కలపడం లేదా సరఫరా వ్యవస్థలో నీరు కలవడం వంటి అంశాలు కూడా కారణమై ఉండొచ్చని LocalCircles అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో ఇంధన కేంద్రాల్లో ఎథనాల్ శాతాన్ని క్రమం తప్పకుండా పారదర్శకంగా పరీక్షించాలని, స్వతంత్ర విచారణ చేపట్టాలని సంస్థ కోరింది.
వివరాలు
E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లో ఇంధన సామర్థ్యం కొంత తగ్గే అవకాశం
అయితే E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లో ఇంధన సామర్థ్యం కొంత తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది.
E20కు అనుగుణంగా రూపొందించని వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గవచ్చని పేర్కొంది.
అయితే E20 వాడటం వల్ల ఇంజిన్‌కు నష్టం జరుగుతుందనే విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ అంశంపై ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI),సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM),ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిర్వహించిన అధ్యయనాల్లో కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాల్లో E20 వినియోగంతో అసాధారణ ఇంజిన్ అరిగిపోవడం గుర్తించలేదని పేర్కొన్నారు.
వివరాలు
E20 వివాదం వినియోగదారుల న్యాయస్థానానికి..
ఇదిలా ఉండగా E20 వివాదం వినియోగదారుల న్యాయస్థానానికి కూడా చేరింది.
2026 జూలై 16న రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ 2024లో కొనుగోలు చేసిన మారుతి సుజుకీ గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనంలో E20 పెట్రోల్ వినియోగం తర్వాత పదేపదే ఇంజిన్ ఆగిపోవడం, మిస్‌ఫైరింగ్, పనితీరు తగ్గడం వంటి సమస్యలు ఎదురైనట్లు యజమాని చేసిన ఫిర్యాదును పరిశీలించింది.
దీంతో వాహనాన్ని నిర్దిష్ట గడువులో మార్చి ఇవ్వాలని మారుతి సుజుకి, డీలర్‌కు ఆదేశించింది.
అలా చేయకపోతే ₹20.50 లక్షలు తిరిగి చెల్లించడంతో పాటు మానసిక వేధింపులకు ₹1 లక్ష పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కోసం ₹10,000 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.