E3 Trion Electric Scooter: భారత్‌లో విడుదలైన E3 ట్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ E3 Electric.AI భారత మార్కెట్లో E3 ట్రియాన్ (Trion) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1 లక్షగా నిర్ణయించింది. ఈ మోడల్‌ను C1, C1x, C2 అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. C1x వేరియంట్ ధర రూ.1,09,999 (బెంగళూరు ఎక్స్-షోరూమ్) కాగా, C2 వేరియంట్ ధర రూ.1,19,999గా నిర్ణయించారు. బేస్ మోడల్ C1లో తొలగించగలిగే (Removable) బ్యాటరీని అందించారు. ప్రస్తుతం బెంగళూరులో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అనంతరం ఇతర నగరాలకు కూడా విక్రయాలను విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
వివరాలు
అద్భుతమైన ఫీచర్లు ఇవే..
బేస్ వేరియంట్ C1లో 2.3kWh రిమూవబుల్ బ్యాటరీను అమర్చారు. ఇది IDC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి పూర్తి చార్జ్‌తో 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ తెలిపింది.
అలాగే గరిష్ఠ వేగం 67 కిలోమీటర్లు/గంటగా ఉంటుంది. ఇక C1x వేరియంట్‌లో 3kWh ఫిక్స్‌డ్ బ్యాటరీను అందించారు.
ఈ స్కూటర్ IDC ప్రమాణాల ప్రకారం గరిష్ఠంగా 165 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
దీంతో ఈ వేరియంట్ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అనువైన ఎంపికగా నిలుస్తుంది.
C2 వేరియంట్‌లో కూడా 3kWh బ్యాటరీనే ఉపయోగించారు. అయితే ఇది IDC ప్రమాణాల ప్రకారం 128 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది.
ఈ మోడల్ గరిష్ఠంగా 82 కిలోమీటర్లు/గంట వేగంతో ప్రయాణించగలదు.
వివరాలు
రిమోట్ బ్యాటరీ మానిటరింగ్ సదుపాయాలు..
అలాగే స్పోర్ట్ మోడ్ను ఆన్ చేసినప్పుడు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ తెలిపింది.
C1, C1x వేరియంట్లలో ఈకో (Eco), పవర్ (Power) రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉండగా, C2లో అదనంగా పనితీరు ఆధారిత స్పోర్ట్ (Sport) మోడ్‌ను కూడా అందించారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పలు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్మార్ట్ ఫీచర్లను కూడా అందించారు.
వీటిలో AI HealthScan Diagnostics, E3 Foresight Reports, సమీప ఛార్జింగ్ స్టేషన్‌ల వివరాలు తెలిపే Smart Trip Planner, కనెక్టెడ్ నావిగేషన్, లైవ్ వెహికల్ డేటా, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
వివరాలు
రహదారులపై మెరుగైన స్థిరత్వం..
అదనంగా 5 అంగుళాల డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సేవలు, డ్యాష్‌క్యామ్ ఫంక్షన్, SOS సహాయ వ్యవస్థ, జియో-ఫెన్సింగ్, చార్జింగ్ ఇన్‌సైట్స్ వంటి ఫీచర్లను కూడా అందించారు.
వాహనంలో ఏదైనా సమస్య తలెత్తే అవకాశాన్ని ముందుగానే గుర్తించి వినియోగదారులకు సమాచారం అందించే విధంగా ఈ AI వ్యవస్థను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
అయితే వాస్తవ వినియోగంలో దీని పనితీరు కాలక్రమేణా ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.
E3 ట్రియాన్లో 14 అంగుళాల పెద్ద చక్రాలు ఉండటంతో నగర ప్రాంతాలు మాత్రమే కాకుండా గ్రామీణ రహదారులపై కూడా మెరుగైన స్థిరత్వం, రోడ్ గ్రిప్ లభిస్తుందని సంస్థ పేర్కొంది.