LOADING...
Electrical vehicles: భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు
భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు

Electrical vehicles: భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
10:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ కావడం విశేషం. వాహన్ పోర్టల్ గణాంకాలను ఆధారంగా తీసుకుని స్టాటిస్టా ఈ వివరాలను వెల్లడించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 12 లక్షల యూనిట్లతో పోలిస్తే దాదాపు 22 శాతం ఎక్కువ. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన రిజిస్ట్రేషన్లలో ఈ-టూవీలర్ల వాటా 6.5 శాతానికి చేరింది.

వివరాలు

జూలై వరకూ సబ్సిడీ పొడిగింపు..

ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ 3,41,513 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తరువాతి స్థానాల్లో బజాజ్ ఆటో 2,89,349 యూనిట్లు, ఏథర్ ఎనర్జీ 2,39,178 యూనిట్లతో నిలిచాయి. ముఖ్యంగా 2026 మార్చి నెలలో భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా మారింది. అలాగే పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా సబ్సిడీల గడువును 2026 జూలై 31 వరకు పొడిగించడం, పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఈ-వాహనాల అమ్మకాలను ప్రోత్సహించాయి.

వివరాలు

మార్కెట్లో భారీ లాభాలు..

కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ఈ రంగం అదే ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. 2026 ఏప్రిల్‌లో 1,48,740 ఈ-టూవీలర్లు రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 61 శాతం అధికం. మే నెల మధ్య వరకు అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక గణాంకాల ప్రకారం టీవీఎస్ మార్కెట్‌లో 25 శాతం వాటాను కొనసాగిస్తుండగా, బజాజ్ 23 శాతం వాటాతో గట్టి పోటీ ఇస్తోంది. పెద్ద స్థాయి పంపిణీ వ్యవస్థలు కలిగిన ప్రముఖ సంస్థలు మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement