Page Loader
Ford Bronco EV: ఫోర్డ్ బ్రోంకో EV లాంచ్.. బ్యాటరీ అయిపోతే పెట్రోల్ ఇంజిన్‌నే బ్యాకప్!
ఫోర్డ్ బ్రోంకో EV లాంచ్.. బ్యాటరీ అయిపోతే పెట్రోల్ ఇంజిన్‌నే బ్యాకప్!

Ford Bronco EV: ఫోర్డ్ బ్రోంకో EV లాంచ్.. బ్యాటరీ అయిపోతే పెట్రోల్ ఇంజిన్‌నే బ్యాకప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోర్డ్‌ తన ఐకానిక్ SUV బ్రోంకోకు కొత్త రూపాన్ని ఇచ్చింది. ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ (Ford Bronco New Energy) పేరిట ఈ సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది - ఒకటి పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్, మరొకటి పెట్రోల్-చార్జ్‌డ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌. ప్రస్తుతం ఈ మోడళ్లు చైనాలో మాత్రమే లభ్యమవుతున్నప్పటికీ, వాటి అధునాతన ఫీచర్లు, టెక్నాలజీ కారణంగా గ్లోబల్ EV మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Details

ఫుల్ EV వెర్షన్‌ ఫీచర్లు 

ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌తో డిజైన్‌ చేశారు. ముందు భాగంలో 177 hp పవర్‌తో మోటార్, వెనుక భాగంలో 275 hp మోటార్ ఉండడంతో మొత్తం 311 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 170 కి.మీ. ఈ SUVలో BYD మోడళ్లలో కనిపించే 105.4 kWh LFP బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 650 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను (CLTC ప్రమాణాల ప్రకారం) అందిస్తుంది. సేఫ్టీ విషయంలో కూడా బ్రోంకో EVను ఎలాంటి రాజీ లేకుండా డిజైన్ చేశారు. ఇందులో అత్యాధునిక ADAS సిస్టమ్‌, LiDAR యూనిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Details

హైబ్రిడ్ వెర్షన్‌లో ప్రత్యేకతలు 

పెట్రోల్-చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌ ముందు 177 hp మోటార్, వెనుక 245 hp మోటార్‌తో వస్తుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది కానీ అది నేరుగా కారును నడపదు. కార్‌ నడుస్తున్నపుడే బ్యాటరీని ఛార్జ్ చేయడం దీని ప్రత్యేకత. అంటే ఇంట్లో ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెర్షన్‌లో 43.7 kWh బ్యాటరీ ఉండగా, ఎలక్ట్రిక్ మోడ్‌లో 220 కి.మీ. ప్రయాణించగలదు. పెట్రోల్‌తో కలిపి మొత్తం 1,220 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌తో ఇది లాంగ్ ట్రిప్స్‌కు ఆదర్శవంతమైన SUVగా నిలుస్తుంది. దాని బరువు 2,510 కిలోగ్రాములు.

Details

ఎవరి కోసం ఈ SUV?

బ్యాటరీ రేంజ్‌పై బాధ పడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. శక్తివంతమైన మోటార్‌లు, అధిక రేంజ్, టెక్నాలజీ ప్రియులకు ఈ SUV సరైన ఎంపిక. ఫోర్డ్ బ్రోంకో న్యూ ఎనర్జీ మార్కెట్లో EV సెగ్మెంట్‌ను శాసించేందుకు వస్తోందని చెప్పొచ్చు. భారత్‌లో విడుదల ఎప్పుడు? ఈ SUVను ఫోర్డ్, జియాంగ్లింగ్ మోటార్స్ కలిసి చైనాలో లాంచ్‌ చేశారు. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఫోర్డ్ అమ్మకాలు నిలిచిపోయినా, ఫోర్డ్ ఎవరెస్ట్‌ మళ్లీ భారత మార్కెట్‌ లోకి రాబోతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటిగా నిలవనుంది.