New Model Cars: కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో లాంచ్ కానున్న లేటెస్ట్ మోడల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఆటో మొబైల్ రంగం ప్రస్తుతం వేగంగా మార్పులు చవిచూస్తోంది. ఒకప్పుడు కారు కేవలం ప్రయాణ సాధనంగా మాత్రమే ఉండగా, నేడు అది హోదా, సౌకర్యానికి ప్రతీకగా మారింది. అందుకే కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుందంటే వాహన ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది. మైలేజీ, ఆధునిక ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు, ముఖ్యంగా ధర వంటి అంశాలపై వినియోగదారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి లగ్జరీ కార్లను ఇష్టపడే వారి వరకు అందరూ మార్కెట్‌పై కన్నేసి ఉంచుతున్నారు. 2026 మార్చిలో పలు కీలక లాంచీలు సందడి చేయగా, ఏప్రిల్ నెల మరింత ఆకర్షణీయమైన అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండగా, ఎలక్ట్రిక్ వాహనాల (EV)విభాగంలో కూడా పోటీ తీవ్రంగా మారింది.
వివరాలు
మరింత స్టైలిష్ డిజైన్ తో ఏప్రిల్ 9న లాంచ్
కంపెనీలు పాత మోడళ్లకు కొత్త ఫీచర్లు జోడించడంతో పాటు, పూర్తిగా కొత్త బ్రాండ్లను కూడా భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌లో విడుదలకానున్న కార్లలో వోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త వెర్షన్ ముఖ్యంగా నిలుస్తోంది. మరింత స్టైలిష్ డిజైన్‌తో ఈ మోడల్‌ను ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు. కొత్త లోగో, కనెక్టెడ్ లైట్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఇక ఎంజీ మోటర్ ఇండియా తన గ్లోస్టర్ స్థానంలో 'మెజెస్టర్' అనే భారీ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానుంది. గంభీరమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఇంజిన్‌తో ఇది టయోటా ఫార్చునర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.
వివరాలు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్లు
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టయోటా తన తొలి ఈవీ 'ఎబెల్లా'ను భారత మార్కెట్లోకి పరిచయం చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఈ కారుకు ఉందని సమాచారం. లగ్జరీ సెగ్మెంట్‌లో మెర్సిడెస్-బెంజ్ ఏప్రిల్ 24న సీఎల్ఏ ఈవీని విడుదల చేయనుంది. ఈ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 792 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే మార్చి నెలలో స్కోడా కుషాక్, రెనాల్ట్ డస్టర్ వంటి మోడళ్లు మార్కెట్లో సందడి చేశాయి. అలాగే హ్యుందాయ్, టాటా మోటార్స్ సంస్థలు కూడా తమ మోడళ్లను అప్‌డేట్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.