V2V: డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఒకదానికొకటి అలర్ట్ ఇచ్చే కార్లు రానున్నాయి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వాహనాల మధ్య నేరుగా సమాచారాన్ని పంచుకునే వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ సిస్టమ్‌ను దశలవారీగా అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు (CMVR), 1989లో సవరణలు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన AIS-230 సాంకేతిక ప్రమాణాన్ని అమలు చేసే రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది.
వివరాలు
V2V టెక్నాలజీ అంటే ఏమిటి?
వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని వాహనాలు ఒకదానితో ఒకటి వేగం, స్థానం, ప్రయాణ దిశ, యాక్సిలరేషన్ వంటి కీలక సమాచారాన్ని రియల్‌టైమ్‌లో పంచుకుంటాయి.
దీంతో రోడ్డుపై ఎదురయ్యే ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌కు లేదా వాహనంలోని భద్రతా వ్యవస్థలకు హెచ్చరికలు అందుతాయి.
ఈ టెక్నాలజీ ద్వారా ఆకస్మికంగా బ్రేక్ వేయడం, ముందున్న వాహనాన్ని ఢీకొనే ప్రమాదం, అసురక్షిత లేన్ మార్పులు, అత్యవసర సేవల వాహనాలు సమీపిస్తున్న సమాచారం వంటి అంశాలపై ముందుగానే అలర్ట్‌లు అందే అవకాశం ఉంటుంది.
వివరాలు
తయారీదారులకు సమయం కల్పించేందుకే దశలవారీ అమలు
ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి వాహన తయారీ సంస్థలు, ఇతర భాగస్వాములు తగిన సన్నాహాలు చేసుకునేందుకు సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో దశలవారీ అమలు ప్రణాళికను ప్రతిపాదించినట్లు కేంద్రం తెలిపింది.
వివరాలు
AIS-230 అమలు ఎప్పటి నుంచి?
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం..
2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే L, M, N కేటగిరీల వాహనాల్లో V2V కమ్యూనికేషన్ సిస్టమ్ అమర్చితే, అది తప్పనిసరిగా AIS-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే అన్ని కొత్త L, M, N కేటగిరీ వాహనాల్లో AIS-230 ప్రమాణాలకు అనుగుణమైన V2V కమ్యూనికేషన్ సిస్టమ్‌ను తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదనకు ముందు, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీల విస్తృత వినియోగానికి అనుకూలంగా 5.875GHz నుంచి 5.925GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వినియోగాన్ని లైసెన్స్ అవసరం నుంచి టెలికమ్యూనికేషన్స్ శాఖ మినహాయించింది.
వివరాలు
రోడ్డు భద్రతకు మరింత బలం
సాంప్రదాయ భద్రతా వ్యవస్థలు వాహనంలోని సెన్సార్లు, డ్రైవర్ స్పందనపై ఆధారపడుతుండగా, V2V టెక్నాలజీ మాత్రం డ్రైవర్‌కు కనిపించని పరిధిలో ఉన్న వాహనాల సమాచారాన్ని కూడా ముందుగానే అందిస్తుంది.
దీంతో ప్రమాదాలను ముందే అంచనా వేసి నివారించే అవకాశం పెరుగుతుంది.
అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో కలిసి పనిచేసే ఈ టెక్నాలజీ భవిష్యత్‌లో కనెక్టెడ్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్రం పేర్కొంది.
వివరాలు
AIS-230 ప్రమాణంలో ఏముంది?
AIS-230 ప్రమాణం భారత రహదారులపై నడిచే వాహనాల్లో అమర్చే V2V కమ్యూనికేషన్ సిస్టమ్‌లకు సంబంధించిన కనీస సాంకేతిక, పనితీరు, ఫంక్షనల్, పర్యావరణ, సైబర్ భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
ఈ ప్రమాణం ప్రకారం ఫ్యాక్టరీలోనే అమర్చే Cellular Vehicle-to-Everything (C-V2X) ఆధారిత ఆన్‌బోర్డ్ యూనిట్లు 5.875GHz-5.925GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేస్తాయి.
అలాగే అత్యవసర బ్రేకింగ్ అలర్ట్‌లు, ముందున్న వాహనాన్ని ఢీకొనే ప్రమాద హెచ్చరికలు, రాంగ్‌వే డ్రైవింగ్ అలర్ట్‌లు, అత్యవసర సేవల వాహనాల నోటిఫికేషన్లు వంటి కీలక భద్రతా ఫీచర్లను కూడా దశలవారీగా అమలు చేయనున్నట్లు ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.