Driving Licence: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు ఇక 50 ఏళ్లు?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువును ప్రస్తుతం ఉన్న 20ఏళ్ల నుంచి 50ఏళ్లకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పు అమల్లోకి వస్తే,తరచూ లైసెన్స్ రెన్యువల్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి అది 20ఏళ్ల పాటు లేదా నిర్దిష్ట వయస్సు వరకు చెల్లుబాటులో ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత అవసరమైన పత్రాలతో పాటు కొన్ని సందర్భాల్లో వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించి లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
ఈ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతో చెల్లుబాటు కాలాన్ని 50 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. లైసెన్స్ రెన్యువల్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఆయా రాష్ట్రాలు భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో వాహన యాజమాన్య హక్కుల బదిలీ, పర్మిట్ల రెన్యువల్ వంటి సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడంపైనా రహదారి రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఈ మార్పుల ద్వారా పేపర్‌వర్క్ తగ్గడంతో పాటు ప్రజలు రవాణా శాఖ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు.
వివరాలు
ప్రాథమిక స్థాయిలో చర్చలు
అయితే డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు పెంపుతో పాటు ఇతర ప్రతిపాదనలన్నీ ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉన్నాయని, వీటిపై ఇంకా ప్రాథమిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.