
Honda shine 100 DX: భారత్‌లో హోండా 25 ఏళ్లు.. స్ప్లెండర్‌కు ధీటుగా షైన్ 100 DX లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. వాటిలో ఒకటి, హీరో స్ప్లెండర్‌కి పోటీగా రూపొందించిన షైన్ 100 డీఎక్స్, మరోటి యువతను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సీబీ 125 హార్నెట్. ఈ రెండూ ఆగస్టు 1వ తేదీ నుంచి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయని హోండా వెల్లడించింది. షైన్ 100 డీఎక్స్ విషయానికి వస్తే, మునుపటి డిజైన్‌నే కొనసాగిస్తూ కొత్త గ్రాఫిక్స్‌తో ఈ వేరియంట్ తీసుకొచ్చారు. దీంట్లో 98.98cc ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ అమర్చారు.
Details
అత్యాధునిక ఫీచర్లు
ఇది 7500 RPM వద్ద 7.28 bhp శక్తి, 5000 RPM వద్ద 8.04 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, హోండా ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ ఉంది. దీని వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ, పనితీరు మెరుగవుతాయని కంపెనీ చెబుతోంది. పొడవైన సీటు, రియల్ టైమ్ మైలేజ్-రేంజ్ ఇండికేటర్లు ఉన్న డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, CBS బ్రేకింగ్ సిస్టమ్, 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సీబీ 125 హార్నెట్ మోడల్‌ను యువత కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
Details
5.4 సెకన్లలోనే 0-60 కిలోమీటర్లు వేగం
ఇది ఫుల్LED లైటింగ్, ఆకర్షణీయమైన ఇంధన ట్యాంక్ డిజైన్ కలిగి ఉంది. దీంట్లో 123.94cc ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంది. ఇది 7500 RPM వద్ద 10.99 bhp శక్తి, 6000 RPM వద్ద 11.2 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 0-60 కిమీ వేగం కేవలం 5.4 సెకన్లలోనే చేరుతుంది. అదనంగా 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్ ఇంటిగ్రేషన్, ABS బ్రేకింగ్, ఇంజిన్ స్టాప్ స్విచ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. ఈ బైక్ నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇక హీరో మోటోకార్ప్ కూడా తన HF డీలక్స్ ప్రో మోడల్‌ను విడుదల చేసింది.
Details
ఇందులో 97.2cc ఇంజన్
దీని ప్రారంభ ధర రూ. 73,550గా నిర్ణయించారు. మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త వేరియంట్‌ను తయారు చేశారు. ఇందులో 97.2cc ఇంజన్ ఉంది. ఇది 8000 RPM వద్ద 7.9 bhp శక్తిని, 6000 RPM వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ i3S టెక్నాలజీపై పని చేస్తుంది. ఇది బైక్ నిలిపినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అయ్యే సదుపాయం కలిగి ఉండటంతో మెరుగైన మైలేజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది.