Honda Rebel 500: హోండా రెబల్ 500 ... ఈ క్లచ్ టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రీమియం బైక్ మార్కెట్లో హోండా మరో క్రూయిజర్‌తో సందడి మొదలుపెట్టింది. భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హోండా రెబల్ 500ను కంపెనీ విడుదల చేసింది. దీని స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.4.49 లక్షలు కాగా, ఈ-క్లచ్ వేరియంట్ ధర రూ.4.89 లక్షలుగా ఉంది. దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. రూ.5,000 టోకెన్ మొత్తంతో హోండా అధికారిక వెబ్‌సైట్ లేదా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. విక్రయాలు, డెలివరీలు బిగ్‌వింగ్ నెట్‌వర్క్ ద్వారానే జరుగుతాయి.
Details
రెండు వేరియంట్లు.. రెండు రంగుల్లో
రెబల్ 500ను స్టాండర్డ్, ఈ-క్లచ్ అనే రెండు వేరియంట్లలో హోండా తీసుకొచ్చింది.
మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.
దేశీయంగా తయారు చేయడం మరో ప్రత్యేకత. చూడగానే ఆకట్టుకునే లో-స్లంగ్ డిజైన్, మినిమలిస్ట్ స్టైలింగ్ ఈ క్రూయిజర్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి.
నగరాల్లో రోజువారీ రైడింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు సరిపోయేలా బైక్‌ను రూపొందించారు.
Details
471సీసీ ఇంజిన్.. 45.6 బీహెచ్‌పీ పవర్
హోండా రెబల్ 500లో 471సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంది.
ఇది 8,500 ఆర్‌పీఎం వద్ద 45.6 బీహెచ్‌పీ పవర్, 6,000 ఆర్‌పీఎం వద్ద 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అయితే ఈ బైక్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫీచర్ ఈ-క్లచ్. క్లచ్ లివర్‌ను నొక్కకుండానే బైక్‌ను స్టార్ట్ చేయడం, ఆపడం, గేర్లు మార్చడం సాధ్యమవుతుంది.
కావాలనుకుంటే రైడర్ సాధారణ మాన్యువల్ క్లచ్‌లాగే లివర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
Details
ట్రాఫిక్‌లో ఈ-క్లచ్.. రైడర్లకు పెద్ద రిలీఫ్
రద్దీ రోడ్లపై బైక్ నడిపేటప్పుడు పదేపదే క్లచ్ నొక్కడం ఇబ్బందిగా ఉంటుంది.
ఈ సమస్యకు రెబల్ 500 ఈ-క్లచ్ వేరియంట్ పరిష్కారం చూపుతుంది. దీంతో సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్‌ల సమయంలో రైడింగ్ మరింత సులభంగా మారుతుంది.
ఫీచర్ల విషయానికి వస్తే ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ ఉన్నాయి.
ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందించారు. మొత్తంగా సంప్రదాయ క్రూయిజర్ స్టైల్‌కు ఆధునిక ఈ-క్లచ్ టెక్నాలజీని జోడించి హోండా రెబల్ 500ను తీసుకొచ్చింది.