Land Rover: ఇండియా-యూకే ఎఫ్‌టీఏ ప్రభావం: జేఎల్‌ఆర్ కార్ల ధరలు రూ.75 లక్షల వరకు తగ్గే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ కింగ్‌డమ్‌తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం ఆటో మొబైల్ రంగంలో స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం కారణంగా దిగుమతి సుంకం ప్రస్తుతం ఉన్న 110 శాతం నుంచి సుమారు 30 శాతానికి తగ్గనుంది. దీంతో కంపెనీకి ఖర్చు తగ్గి, ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని జేఎల్‌ఆర్ యోచిస్తోంది. ఈ నెల 20 తర్వాత అమల్లోకి వచ్చే కొత్త ధరలపై డీలర్లకు సమాచారం అందిస్తామని కంపెనీ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
వివరాలు
త్వరలోనే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ సిరీస్‌లో కొత్త వేరియంట్
మోడల్‌ను బట్టి జేఎల్‌ఆర్ కార్ల ధరలు సుమారు 13 నుంచి 15 శాతం వరకు తగ్గవచ్చని అంచనా. మొత్తంగా చూస్తే ఇది రూ.40లక్షల నుంచి రూ.75 లక్షల వరకు తగ్గుదలగా ఉండొచ్చు. ప్రస్తుతం రూ.4.25కోట్ల ధరలో ఉన్న టాప్ ఎండ్ రేంజ్ రోవర్ ఎస్‌వీ 4.4మోడల్ ధర రూ.63 నుంచి రూ.75లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ మోడల్ ధర కూడా సుమారు రూ.40లక్షల మేర తగ్గవచ్చని సమాచారం. ఇదిలా ఉండగా, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను కూడా కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర సుమారు రూ.2.05 కోట్ల వద్ద ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
బ్రిటిష్ పౌండ్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 13 శాతం తగ్గింది
అయితే అన్ని మోడళ్లపై ఈ తగ్గింపు వర్తించదు. స్లొవేకియాలో పూర్తిగా తయారయ్యే ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడల్ ధరలో తక్షణ మార్పు ఉండకపోవచ్చు. అలాగే భారత్‌లోనే తయారవుతున్న మోడళ్ల ధరలు కూడా యథాతథంగా ఉండనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ సుంకం తగ్గింపు ప్రయోజనాలు పూర్తిగా విదేశాల్లో తయారైన (సీబీయూ) అధిక సామర్థ్యం ఉన్న ఇంజిన్ వాహనాలకే వర్తిస్తాయి. ఇక మరోవైపు, బ్రిటిష్ పౌండ్‌తో పోలిస్తే రూపాయి విలువ గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 13 శాతం తగ్గింది. దీనివల్ల సుంకం తగ్గింపుతో వచ్చే లాభం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.