Loading...
JLR Land Rover: అమెరికా మార్కెట్‌పై జేఎల్‌ఆర్‌ ఫోకస్‌.. లగ్జరీ పికప్‌ ట్రక్‌కు సన్నాహాలు
అమెరికా మార్కెట్‌పై జేఎల్‌ఆర్‌ ఫోకస్‌.. లగ్జరీ పికప్‌ ట్రక్‌కు సన్నాహాలు

JLR Land Rover: అమెరికా మార్కెట్‌పై జేఎల్‌ఆర్‌ ఫోకస్‌.. లగ్జరీ పికప్‌ ట్రక్‌కు సన్నాహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (JLR) సంస్థ తన ప్రముఖ ఎస్‌యూవీ బ్రాండ్‌ డిఫెండర్‌ (Defender) ఆధారంగా లగ్జరీ పికప్‌ ట్రక్‌ను తయారు చేయాలని యోచిస్తోంది. ఈ వాహనాన్ని అమెరికాలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఆటోమోటివ్‌ న్యూస్‌ కథనం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం జేఎల్‌ఆర్‌.. స్టెల్లాంటిస్‌ (Stellantis) సంస్థతో భాగస్వామ్యం చేసుకోనుంది. ఇదే జరిగితే అమెరికాలో జేఎల్‌ఆర్‌కు ఇదే తొలి ఉత్పత్తి కార్యక్రమం అవుతుంది. ఉత్తర అమెరికా మార్కెట్లో తమ ఉనికిని మరింత పెంచుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

దిగుమతి వాహనాలపై అమెరికా సుంకాలు

గతేడాది జేఎల్‌ఆర్‌ ప్రపంచవ్యాప్త విక్రయాల్లో ఉత్తర అమెరికా మార్కెట్‌ వాటా దాదాపు 30 శాతంగా ఉంది.

ఇందులో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ప్రస్తుతం జేఎల్‌ఆర్‌ విక్రయించే అన్ని వాహనాలను ఇతర దేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేస్తున్నారు.

2025లో ట్రంప్‌ ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాల కారణంగా ఈ వాహనాల ధరలు పెరుగుతున్నాయి.

బ్రిటన్‌లో తయారయ్యే రేంజ్‌ రోవర్‌, డిస్కవరీ స్పోర్ట్‌ వంటి మోడళ్లపై 10 శాతం సుంకం ఉండగా.. యూరోపియన్‌ యూనియన్‌లో తయారయ్యే డిస్కవరీ, డిఫెండర్‌ వాహనాలపై 15 శాతం టారిఫ్‌ అమలవుతోంది.

వివరాలు 

స్టెల్లాంటిస్‌తో జేఎల్‌ఆర్‌ భాగస్వామ్యం

ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడంతోపాటు అమెరికా మార్కెట్లో విస్తరించేందుకు జేఎల్‌ఆర్‌.. మే నెలలో స్టెల్లాంటిస్‌తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

అమెరికాలో వాహనాల అభివృద్ధి, ఉత్పత్తి అంశాల్లో కలిసి పనిచేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

జూన్‌లో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో జేఎల్‌ఆర్‌ సీఈఓ పీబీ బాలాజీ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమకు ఉన్న ప్రపంచవ్యాప్త వ్యాపార స్థాయికి అనుగుణంగా అమెరికా మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

స్లోవేకియాలో కొనసాగనున్న డిఫెండర్‌ తయారీ

స్టెల్లాంటిస్‌తో భాగస్వామ్యం కారణంగా డిఫెండర్‌ ఉత్పత్తిని స్లోవేకియా నుంచి అమెరికాకు తరలించబోమని తెలుస్తోంది.

బదులుగా, అమెరికా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త డిఫెండర్‌ వాహనాలను అభివృద్ధి చేయడంలో ఈ భాగస్వామ్యం సహకరించనుంది.

ఇందులో భాగంగా తొలుత పికప్‌ ట్రక్‌ను రూపొందించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ప్రస్తుత డిఫెండర్‌ డిజైన్‌, నిర్మాణాన్ని అనుసరిస్తే.. ఇది యూనిబాడీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడే అవకాశం ఉంది.

ప్రస్తుతం స్టెల్లాంటిస్‌ తన పికప్‌ ట్రక్కుల్లో ఈ తరహా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం లేదు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా కొనుగోలుదారులకు కొత్త అనుభవం

అమెరికా పికప్‌ ట్రక్‌ మార్కెట్‌లో దేశీయ వాహన తయారీ సంస్థల ఆధిపత్యం ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో లగ్జరీ బ్రాండ్‌ నుంచి పికప్‌ ట్రక్‌ రావడం ఆసక్తికర పరిణామంగా మారనుంది.

అయితే అమెరికా సంస్థలు ఇప్పటికే తమ ఫుల్‌-సైజ్‌ పికప్‌ ట్రక్కుల్లో అధిక సౌకర్యాలు, విలాసవంతమైన ఫీచర్లతో కూడిన వేరియంట్లను అందిస్తున్నాయి.

స్టెల్లాంటిస్‌తో భాగస్వామ్యం ద్వారా అమెరికా కొనుగోలుదారుల అవసరాలను జేఎల్‌ఆర్‌ మరింతగా అర్థం చేసుకుని, ల్యాండ్‌ రోవర్‌ విలాసవంతమైన శైలిని స్థానిక మార్కెట్‌ అవసరాలతో కలిపిన కొత్త పికప్‌ను రూపొందించే అవకాశం ఉంది.

ADVERTISEMENT