JSW MG Motor: నేపాల్ మార్కెట్‌పై జేఎస్‌డబ్ల్యూఎంజీ ఫోకస్.. కొత్త డీలర్‌షిప్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నేపాల్‌లో తమ వ్యాపార విస్తరణకు మరో కీలక అడుగు వేసింది. దేశంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు గోల్ఛా ఆర్గనైజేషన్‌తో వ్యూహాత్మక పంపిణీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా నేపాల్ మార్కెట్‌లో మరింత వినియోగదారుల కేంద్రిత సేవలను అందించడంతో పాటు, బ్రాండ్‌కు బలమైన స్థానం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కొత్త ఎంజీ డీలర్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో సాంకేతికంగా ఆధునిక ఫీచర్లతో కూడిన ఎంజీ వాహనాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా హెక్టర్, విండ్సర్, కామెట్ వంటి మోడళ్లను ప్రదర్శనకు ఉంచుతున్నారు. వివిధ విభాగాల వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
వివరాలు
వినియోగదారులపై ఫోకస్..
ఇటీవలి కాలంలో నేపాల్‌లో స్మార్ట్, పర్యావరణ హిత వాహనాలపై డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్న నేపథ్యంలో, అక్కడి మార్కెట్‌ను ఎంజీ కీలకంగా భావిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా తమ వాహనాలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయడంతో పాటు, దేశంలో బలమైన సేవలు, అమ్మకాల తర్వాత మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులకు నమ్మకమైన, సౌకర్యవంతమైన వాహన వినియోగ అనుభవాన్ని అందించడంపై సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది.
వివరాలు
మార్కెట్‌లో బ్రాండ్‌కు బలమైన స్థానం..
ఈ సందర్భంగా నేపాల్ డీలర్ ప్రతినిధి ఆకాష్ గోల్ఛా మాట్లాడుతూ.. జేఎస్‌డబ్ల్యూఎంజీ మోటార్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంజీ వాహనాలను నేపాల్ వినియోగదారులకు పరిచయం చేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఆధునిక సదుపాయాలు, మెరుగైన సేవలతో వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని అందించేలా ఈ డీలర్‌షిప్‌ను రూపొందించామని చెప్పారు. సాంకేతికత, ఆకర్షణీయమైన రూపకల్పన, పర్యావరణ హిత లక్షణాల కలయికతో ఉన్న ఎంజీ వాహనాలు నేపాల్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉంటాయని తాము నమ్ముతున్నామని తెలిపారు. మార్కెట్‌లో బ్రాండ్‌కు బలమైన స్థానం తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
వివరాలు
త్వరలో మరో మోడల్ విడుదల..
ఇదిలా ఉండగా, భారత మార్కెట్‌లో కూడా జేఎస్‌డబ్ల్యూఎంజీ మోటార్ ఇండియా మంచి వృద్ధిని నమోదు చేసింది. తాజా పరిశ్రమ గణాంకాల ప్రకారం, 2026 ఏప్రిల్‌లో కంపెనీ హోల్‌సేల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగాయి. ఆ నెలలో దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్‌కు మొత్తం 6,018 వాహనాలను పంపిణీ చేసింది. అలాగే, భారత మార్కెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మజెస్టర్ మోడల్‌ను త్వరలో విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది.