LOADING...
JSW MG Motor: నాన్-మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. విండ్సర్ ఈవీకి 70% అమ్మకాలు అక్కడి నుంచే
నాన్-మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. విండ్సర్ ఈవీకి 70% అమ్మకాలు అక్కడి నుంచే

JSW MG Motor: నాన్-మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. విండ్సర్ ఈవీకి 70% అమ్మకాలు అక్కడి నుంచే

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాలకే పరిమితమైందని భావించిన ఈవీ మార్కెట్ ఇప్పుడు చిన్న పట్టణాలల్లో వేగంగా విస్తరిస్తోంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. కంపెనీకి చెందిన విండ్సర్ ఈవీ మోడల్‌కు భారీగా డిమాండ్ వస్తోంది. మొత్తం అమ్మకాలలో 70 శాతం నాన్-మెట్రో నగరాల నుంచే నమోదవుతున్నాయి. 2024 అక్టోబర్‌లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కారు సుమారు 65,000 యూనిట్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి కేవలం 30 శాతం అమ్మకాలే వస్తుండగా, మిగతా వాటా మొత్తం చిన్న పట్టణాలు, నగరాల నుంచే వస్తోంది.

వివరాలు

మొదట్లో మెట్రో నగరాలకే పరిమితం..

కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ రైనా మాట్లాడుతూ, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మొదట్లో మెట్రో నగరాలకే పరిమితమైందని చెప్పారు. అవగాహన కొరత, అందుబాటులో సరైన మోడళ్ల లేమి కారణంగా ఇది జరిగిందని తెలిపారు. అయితే విండ్సర్ ఈవీ రాకతో పరిస్థితి మారిందని, ముఖ్యంగా నాన్-మెట్రో నగరాల్లో ఈవీల వినియోగాన్ని వేగంగా పెంచిందని ఆయన పేర్కొన్నారు. తక్కువ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి లక్షణాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. నాన్-మెట్రో ప్రాంతాలు ఇప్పుడు ఈవీ మార్కెట్‌కు పెద్ద అవకాశంగా మారాయని రైనా తెలిపారు. ఈ ప్రాంతాల్లో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ పెంచడం ద్వారా అమ్మకాలను మరింత పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు

త్వరలో నాలుగు కొత్త మోడళ్లు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కంపెనీకి 541 సేల్స్, సర్వీస్ కేంద్రాలు ఉన్నాయి. అందులో కేవలం 51 మాత్రమే మెట్రో నగరాల్లో ఉన్నాయి. 2024 అక్టోబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు కంపెనీ దాదాపు 1 లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది. ఇందులో కోమెట్, జెడ్‌ఎస్ ఈవీ వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. 2025లో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఇంటర్నల్ కంబషన్ వాహనాలు కలిపి) 70,554 యూనిట్లకు చేరుకుని, గత ఏడాదితో పోలిస్తే 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముందు చూస్తే, ఈ ఏడాదిలో నాలుగు కొత్త మోడళ్లను, అందులో ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్‌లో తదుపరి దశ వృద్ధిని సాధించేందుకు ఇది కీలకంగా మారనుంది.

Advertisement