Tata Motors Sales 2026: 10 నెలల్లోనే గతేడాది రికార్డు బద్దలు.. టాటా మోటార్స్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఆటో మొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2026లో మొదటి 10 నెలల్లోనే 2025 పూర్తి ఏడాది అమ్మకాల సంఖ్యను అధిగమించింది. జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 6,49,477 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 4,71,290 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 37.81 శాతం పెరిగాయి. మరోవైపు 2025 పూర్తి ఏడాదిలో టాటా మోటార్స్ విక్రయించిన 5,78,772 యూనిట్ల కంటే ఈసారి ఇప్పటికే 70,705 వాహనాలు అధికంగా అమ్ముడయ్యాయి.
వివరాలు
అక్టోబర్‌లోనూ భారీ అమ్మకాలు..
2026 సెప్టెంబర్ చివరి నాటికి టాటా మోటార్స్ మొత్తం 5,75,583 వాహనాలను విక్రయించింది. దీంతో 2025 పూర్తి ఏడాది అమ్మకాల రికార్డును అధిగమించడానికి మరో 3,189 యూనిట్లు మాత్రమే అవసరమయ్యాయి.
అక్టోబర్‌లో ఏకంగా 73,894 వాహనాలను విక్రయించడంతో ఆ రికార్డును సులభంగా అధిగమించింది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 61,134 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 20.87 శాతం పెరిగాయి.
సెప్టెంబర్‌లో విక్రయించిన 68,810 యూనిట్లతో పోలిస్తే కూడా 7.39 శాతం వృద్ధి నమోదైంది.
2026 జనవరిలో 70,222వాహనాలను విక్రయించిన టాటా.. ఫిబ్రవరిలో 62,329 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.
మార్చిలో 66,192 యూనిట్లు, ఏప్రిల్‌లో 59,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మే నుంచి అక్టోబర్ వరకు ప్రతినెలా అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి.
వివరాలు
7 లక్షల మార్కుపై టాటా కన్ను..
ముఖ్యంగా జూన్‌లో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 67.4 శాతం వృద్ధి నమోదైంది. ఆ నెలలో మొత్తం 62,076 వాహనాలను విక్రయించింది.
2026 క్యాలెండర్ ఇయర్‌లో మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 7 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాల మైలురాయిని చేరుకోవాలంటే టాటా మరో 50,523 యూనిట్లను విక్రయించాల్సి ఉంటుంది.
అదే 8 లక్షల మార్కును అందుకోవాలంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి ఏకంగా 1,50,523 వాహనాలను అమ్మాలి.
అంటే నెలకు సగటున 75,262 యూనిట్ల అమ్మకాలు సాధించాల్సి ఉంటుంది. అక్టోబర్‌లో నమోదైన 73,894 యూనిట్లతో పోలిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత ఎక్కువ అమ్మకాలు అవసరం.
వివరాలు
పంచ్ టాప్.. నెక్సాన్ తర్వాతి స్థానం
మోడళ్ల వారీగా అమ్మకాలను పరిశీలిస్తే.. టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 2,02,794 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది పూర్తి ఏడాది అమ్మకాల కంటే కూడా 29,292 యూనిట్లు అధికంగా విక్రయించింది. ఇక నెక్సాన్ 1,96,490 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ రెండు మోడళ్లు కలిపి టాటా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 61.48 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి.
ఆ తర్వాత టియాగో 70,555 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రా కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు 69,779 కార్లు అమ్ముడయ్యాయి.
వివరాలు
ప్రతి ఐదు కార్లలో ఒకటి ఈవీనే!
ఇక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏరిస్ మోడల్ 6,411యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఇతర మోడళ్ల విషయానికి వస్తే.. హారియర్ 31,810 యూనిట్లు, ఆల్ట్రోజ్ 27,579యూనిట్లు, కర్వ్ 18,447 యూనిట్లు, సఫారీ 17,088యూనిట్లు, టిగోర్ 8,524 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.
ముఖ్యంగా హారియర్ గతేడాది పూర్తి ఏడాది అమ్మకాలైన 27,410యూనిట్లను కూడా అధిగమించడం విశేషం.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ టాటా మోటార్స్ మంచి వృద్ధిని సాధించింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,24,792 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.
మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా 19.21 శాతంగా ఉంది. అంటే టాటా విక్రయిస్తున్న ప్రతి ఐదు కార్లలో దాదాపు ఒకటి ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం.