Maruthi Suzuki:మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్: 85% ఇథనాల్‌తో పరుగులు, 2026లో మార్కెట్లోకి
ఈ వార్తాకథనం ఏంటి
ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) వాడకంపై కార్ల యజమానుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ, మారుతీ సుజుకీ కంపెనీ ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయం సిద్ధం చేసింది. ఈ సంస్థ 2026 నాటికి భారత మార్కెట్లోకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ క్రాసోవర్‌ను ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉంది. ఇథనాల్ ఆధారిత వాహనం ప్రత్యేకత ఇథనాల్-మిశ్రమ పెట్రోల్ వాడకంపై చాలామందికి తమ పాత కార్లు అందుకు అనుకూలమా లేదా అన్న సందేహాలు ఉంటాయి. కానీ సుజుకి జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించిన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్ వెర్షన్, ఆ ఆందోళనలకు సమాధానం చెబుతోంది.
వివరాలు
ఇథనాల్ ఆధారిత వాహనం ప్రత్యేకత
ఈ వాహనం 85 శాతం వరకు ఇథనాల్ (E85) కలిపిన పెట్రోల్‌తో సాఫీగా నడిచే సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రధాన బలం. భవిష్యత్తులో దేశంలోని పెట్రోల్ బంకుల్లో E85 ఇంధనం అందుబాటులోకి వచ్చినా, ఈ వాహనం ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కోదు. ప్రస్తుతం భారత ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఇథనాల్ మిశ్రమాన్ని 30% వరకు పెంచాలని, తదుపరి మరింత శాతం చేరేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ క్రాసోవర్ 2026లో విడుదలయ్యే సమయానికి వినియోగదారుల దృష్టిని ఆకర్షించడం ఖాయం.
వివరాలు
డిజైన్ విషయానికొస్తే..
ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్ రూపకల్పన ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న సాధారణ ఫ్రాంక్స్ మోడల్‌నే పోలి ఉంటుంది. దీని పొడవు 3,995 మి.మీ., వెడల్పు 1,765 మి.మీ.,ఎత్తు 1,550 మి.మీ. ఇవన్నీ స్టాండర్డ్ వెర్షన్ కొలతలే. వాహనానికి బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉండగా, కనపడే ముఖ్యమైన తేడా ఇంధన ట్యాంక్ కవర్‌పై ఆకుపచ్చ రంగులో ఉన్న"Flex Fuel" స్టిక్కర్ మాత్రమే. ఫీచర్లు జపాన్ మొబిలిటీ షోలో చూపిన కాన్సెప్ట్, భారతదేశంలో తయారు చేసి జపాన్‌కి ఎగుమతి చేసే ఫ్రాంక్స్ మోడల్‌లో ఉన్న ఫీచర్లతోనే రూపొందించబడింది. జపాన్-స్పెక్ ఫ్రాంక్స్‌లో ADAS (Advanced Driver Assistance Systems)సిస్టమ్ ఉండగా,హీటెడ్ ఫ్రంట్ సీట్లు,ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (EPB),ఆటో హోల్డ్ ఫీచర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
వివరాలు
ఇంజిన్ సామర్థ్యం
జపాన్ వెర్షన్‌లో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. అదనంగా, సుజుకి AllGrip Select AWD (All-Wheel Drive) టెక్నాలజీ కూడా అందిస్తోంది. ఇక భారతీయ ఫ్రాంక్స్ మోడల్‌లో ప్రస్తుతం 1.2 లీటర్ల డ్యుయల్-జెట్ పెట్రోల్ ఇంజిన్, అలాగే ఆప్షనల్‌గా 1.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ కోసం మారుతి సుజుకి కొత్త 1.5 లీటర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుందా లేక ఇప్పటికే ఉన్న ఇంజిన్లను సవరించి ఉపయోగిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
వివరాలు
E20 నుంచి E85 వరకు ఇంధన అనుకూలత
మారుతి సుజుకి ఇంకా ఈ కాన్సెప్ట్ యొక్క పూర్తి సాంకేతిక వివరాలు వెల్లడించకపోయినా, ఒక ముఖ్యమైన అంశాన్ని మాత్రం ధృవీకరించింది. ఈ వాహనం E20 (20% ఇథనాల్) నుండి E85 (85% ఇథనాల్) వరకు ఉన్న ఇంధన మిశ్రమాలతో సాఫీగా నడిచే సామర్థ్యం కలిగి ఉంది. అంటే, ప్రస్తుతం దేశంలో లభించే E20 పెట్రోల్‌తో కూడా ఇది సరళంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో E85 పెట్రోల్ అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా దీనికి ఎటువంటి ఇంధన సంబంధిత సమస్యలు ఉండవు.