అత్యంత ఖరీదైన కారును లాంచ్ చేయనున్న మారుతీ.. 'ఎంగేజ్'తో ముందుకు!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇటీవలే జిమ్మీని విడుదల చేసింది. తాజాగా మరో కొత్తకారును వచ్చే నెల 5న లాంచ్ చేయనుంది. దాని పేరు ఎంగేజ్. కొత్త ఎంపీవీ డిజైన్ లో కొన్ని మార్పులను చేయడం ద్వారా ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ కంటే ప్రత్యేకంగా దర్శనమివ్వనుంది. ఈ 7 సీటర్ ఎంగేజ్ వివరాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. ముఖ్యంగా యుటిలిటీ వెహికల్స్ సెగ్మెంట్ లో మారుతీ సుజుకీ క్రేజ్ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్ పై అంచనాలను పెంచేందుకు గత 12 నెలల్లో ఏకంగా నాలుగు మోడల్స్ ను లాంచ్ చేయడం విశేషం. ఈ మారుతీ సుజుకీ ఎంగేజ్ ఎంపీవీ పెట్రోల్, హాబ్రీడ్ వేరియంట్లు మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లను చేస్తోంది.
రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్న మారుతీ ఎంగేజ్
మారుతీ ఎంగేజ్ ఇన్నోవా హైక్రాస్ లాగానే రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. దీని ఇంటీరియల్ కూడా దాదాపు ఇన్నోవా హైక్రాస్ ను పోలి ఉన్నట్లు సమాచారం. మారుతీ లాంచ్ చేయనున్న అత్యంత ఖరీదైన కారు ఎంగేజ్ అని తెలుస్తోంది. మారుతీ సుజుకీ రాబోయే రోజుల్లో దేశంలో అనేక హైబ్రిడ్ కార్ మోడళ్లను తీసుకురావడానికి సన్నాహాలను చేస్తోంది. ఎంగేజ్ ఎంపీవీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ఇంజిన్ ఆప్షన్, ధర వంటి వివరాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మారుతీ నుండి వచ్చిన కొత్త ఎంపీవీ కూడా హైక్రాస్ మాదిరిగానే ఉండనున్నట్లు సమాచారం. ఎంగేజ్ ఎపీవీతో సంస్థ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.