Maruti Suzuki: మారుతీ సుజుకీ @ 3 కోట్లు.. ఎక్కువగా అమ్ముడైన మోడల్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారు మారుతీ సుజుకీ మరో ప్రత్యేకమైన రికార్డును నమోదు చేసింది. దేశీయ మార్కెట్‌లో మొత్తం 3 కోట్ల కార్ల విక్రయాలు పూర్తి చేసినట్లు బుధవారం అధికారికంగా తెలిపింది. కంపెనీ వివరణ ప్రకారం..మొట్ట మొదటి 1 కోటి వాహనాల విక్రయాలకు 28 సంవత్సరాలు 2 నెలలు సమయం పట్టగా,తర్వాతి 1 కోటి కార్ల విక్రయాలు 7 సంవత్సరాలు 5 నెలల్లో పూర్తయ్యాయి. చివరి మూడవ కోటి విక్రయాల కోసం 6 సంవత్సరాలు 4 నెలలు పట్టినట్లు వెల్లడించింది. ఈ 3 కోట్ల వాహనాల్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా మారుతీ సుజుకీ ఆల్టో నిలిచింది. ఇప్పటి వరకు మొత్తం 47 లక్షల ఆల్టోలు వినియోగదారులకు చేరినట్లు తెలిపింది.
వివరాలు
దేశంలో ప్రతి వెయ్యి మందిలో కేవలం 33 మందికే కార్లు
ఆల్టో తర్వాత స్థానాల్లో వ్యాగనార్ (సుమారు 34 లక్షలు),స్విఫ్ట్ (సుమారు 32 లక్షలు) ఉన్నాయని వివరించింది. అలాగే కంపెనీ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న బ్రెజా, ఫ్రాంక్స్ మోడళ్లూ తమ టాప్-10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఉన్నాయని తెలిపింది. మారుతీ సుజుకీ ఇండియా ఎండీ & సీఈఓ హిశాషి టకుచి మాట్లాడుతూ,ప్రస్తుతం దేశంలో ప్రతి వెయ్యి మందిలో కేవలం 33 మందికే కార్లు ఉన్నాయి అని అన్నారు.
వివరాలు
1983 డిసెంబర్ 14న మారుతీ 800తో కార్ల ప్రయాణాన్ని ప్రారంభించిన మారుతీ సుజుకీ
దీని ద్వారా భారత ఆటో మార్కెట్‌లో ఇంకా అభివృద్ధికి పెద్ద అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరింత మంది వినియోగదారులకు కార్లను చేరవేయడం కోసం కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని అన్నారు. 1983 డిసెంబర్ 14న మారుతీ 800తో కార్ల ప్రయాణాన్ని ప్రారంభించిన మారుతీ సుజుకీ, ప్రస్తుతం 19 మోడళ్లను, 170 వరకు వేరియంట్లలో దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతోంది.