Maruti Suzuki: కస్టమర్లకు మరింత చేరువగా.. సర్వీస్ సెంటర్లను పెంచిన మారుతీ సుజుకీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని అతిపెద్ద ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ తన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్‌వర్క్‌ను భారీ స్థాయిలో విస్తరించింది. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏకంగా 502 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్లను ప్రారంభించినట్లు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. ఒకే ఏడాదిలో ఇంత భారీగా నెట్‌వర్క్ విస్తరణ చేపట్టడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విస్తరణతో మారుతీ సుజుకీ మొత్తం సర్వీస్ కేంద్రాల సంఖ్య 3,000 నగరాలు, పట్టణాల్లో 5,926కు చేరుకుంది. మెట్రో నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు వినియోగదారులకు సేవలు అందించేందుకు కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది.
వివరాలు
త్వరితగతిన సేవలు అందేలా ప్లాన్
ఈ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ARENA, NEXA వర్క్‌షాప్‌లు, మారుతీ సుజుకీ సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్లు (MSSPs), అలాగే 'సర్వీస్-ఆన్-వీల్స్' వంటి విభిన్న ఫార్మాట్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కస్టమర్లకు మరింత సులభంగా, త్వరితగతిన సేవలు అందేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. "వినియోగదారులు వర్క్‌షాప్‌కు రావాలనుకున్నా, ఇంటి వద్దే సేవలు కోరుకున్నా, లేదా రోడ్ ట్రిప్ సమయంలో సహాయం అవసరమైనా.. మారుతీ సర్వీస్ కేంద్రం వారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వివరాలు
అమ్మకాల పరంగా రికార్డు
అలాగే 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ నెట్‌వర్క్‌ను సుమారు 8,000 టచ్‌పాయింట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మారుతీ సుజుకీ తన తొలి సర్వీస్ వర్క్‌షాప్‌ను 1983లో ప్రారంభించింది. 1,000 కేంద్రాల మార్కును చేరుకోవడానికి సంస్థకు సుమారు 14 సంవత్సరాలు పట్టింది. ఇక అమ్మకాల పరంగా కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో రిటైల్ అమ్మకాలు 5 శాతం పెరిగాయి. గతేడాది మార్చిలో 1,92,984 యూనిట్లు విక్రయించగా, ఈసారి 2,25,251 యూనిట్లు అమ్ముడయ్యాయి. షేర్ మార్కెట్‌లో కూడా కంపెనీ షేరు ప్రదర్శన సానుకూలంగా ఉంది. గురువారం బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేరు ధర 1 శాతం పెరిగి రూ. 12,632 వద్ద ముగిసింది.