Maruti Suzuki: కారు ధరలు పెరిగినా టెన్షన్ లేదు.. మారుతీ కొత్త హామీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
చిన్న కార్ల కొనుగోలుదారులకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ శుభవార్త చెప్పింది. వినియోగదారులకు ధరల పెరుగుదల భారం పడకుండా ఉండేందుకు కంపెనీ 'ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్'ను ప్రకటించింది. ఈ పథకం కింద కారు బుక్ చేసిన సమయంలో ఉన్న ధరలకే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. డెలివరీ సమయానికి ధరలు పెరిగినా అదనపు భారం వినియోగదారులపై ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 14లోపు కార్లను బుక్ చేసుకునే కస్టమర్లకే వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల వాహనాల తయారీ,నిర్వహణ వ్యయాలు పెరగడం,ద్రవ్యోల్బణ ప్రభావంతో మే నెలలో మారుతీ సుజుకీ తన పలు మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ.30 వేల వరకు పెంచిన విషయం తెలిసిందే.
వివరాలు
ఈ మోడళ్లకు మాత్రమే పథకం వర్తింపు
ఈ నేపథ్యంలో చిన్న కార్ల కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. చిన్న కార్ల విభాగంలో వినియోగదారులకు మరింత ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చామని తెలిపారు. జూన్ 14లోపు బుక్ చేసిన వాహనాలకు బుకింగ్ సమయంలో ఉన్న ధరలే డెలివరీ సమయంలో కూడా వర్తిస్తాయని, ఆ తర్వాత కంపెనీ ధరలు పెంచినా ఆ ప్రభావం కస్టమర్లపై ఉండదన్నారు. ఈ పథకం ప్రస్తుతం ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వాగన్ ఆర్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.