Loading...
Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటుంది: ఇరాన్
అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటుంది: ఇరాన్

Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటుంది: ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్‌ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్‌ పేర్కొంది. పశ్చిమాసియా దేశాలు అణుశక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌ ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటుందని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాన్ని ఎలాగైనా నిలువరించేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తుందని ఆయన అంచనా వేశారు. మీడియాతో మాట్లాడిన ఇస్మాయిల్‌.. అణుశక్తిని శాంతియుత అవసరాల కోసం వినియోగించుకోవడం ప్రతి దేశానికి ఉన్న చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేశారు. ఈ హక్కును ఏ దేశమూ ప్రశ్నించలేదని, శాంతియుత అణుశక్తి వినియోగానికి ఇరాన్‌ మద్దతు ఇస్తుందని చెప్పారు.

వివరాలు 

తమ దేశ ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యం: ఇస్మాయిల్

అమెరికా నుంచి వచ్చే బెదిరింపులకు ఇరాన్‌ తలొగ్గదని,దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

శాంతి నెలకొనాలా,యుద్ధం చెలరేగాలా అనే విషయాన్ని నిర్ణయించే అధికారం అమెరికాకు లేదని స్పష్టం చేశారు.

అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత హర్మూజ్‌ జలసంధి పరిసరాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై మీడియా ప్రశ్నించగా.. తమ దేశ ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇస్మాయిల్‌ తెలిపారు.

ఇలాంటి అంశాల్లో నిర్దిష్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వం తుదినిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.

ఇరాన్‌పై జరిగిన సైనిక దాడులకు అమెరికానే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ దాడుల్లో కొన్ని గల్ఫ్‌ దేశాల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపించారు.

వివరాలు 

సౌదీ అరేబియాకు యురేనియం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికా

ఇదిలా ఉండగా, పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం సరఫరా చేసేందుకు అమెరికా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని రియాద్‌లో అభివృద్ధి చేసుకునేందుకు 30 సంవత్సరాలపాటు అమల్లో ఉండే అణు సహకార ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలిపారు.

ఈ ఒప్పందం అణ్వస్త్రాల వ్యాప్తికి దారితీయదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.

అయితే, ఈ ఒప్పందం అమలును ఇజ్రాయెల్‌ తప్పకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఇరాన్‌ ప్రకటించడం పశ్చిమాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT