Maruti Suzuki: మారుతీ సుజుకీ స్విఫ్ట్ సిఎన్‌జీ వేరియంట్ విడుదల
భారత మార్కెట్లో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ప్రముఖమైనది చెప్పొచ్చు. తాజాగా, మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోడల్‌లో సిఎన్‌జీ వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ.8.19 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది అధిక ఇంధన సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది. సిఎన్‌జీ కార్ల విభాగంలో మారుతీ ఇప్పటికే ముందంజలో ఉంది. ప్రస్తుతం 14 సిఎన్‌జీ మోడల్స్‌తో మారుతీ పోర్ట్‌ఫోలియో విస్తరించింది. ఈ కొత్త స్విఫ్ట్ సిఎన్‌జీ వేరియంట్‌లో 1.2 లీటర్ జెడ్ సిరీస్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 69.75PS శక్తిని, 101.8Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అత్యాధునిక ఫీచర్లు
ఈ వేరియంట్ కిలో సిఎన్‌జీకి 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అత్యాధునిక సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లతో ఈ వాహనం ఆకట్టుకుంటుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+, హిల్ హోల్డ్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ముందు వీఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ వేరియంట్లలో మాత్రమే సిఎన్‌జీ అందుబాటులో ఉండగా, ఇప్పుడు వీఎక్స్‌ఐ(o) వేరియంట్ కూడా ప్రవేశపెట్టారు. వీఎక్స్‌ఐ సిఎన్‌జీ వేరియంట్ ధర రూ.8.19 లక్షలు, వీఎక్స్‌ఐ(o) ధర రూ.8.46 లక్షలు, జెడ్‌ఎక్స్‌ఐ సిఎన్‌జీ ధర రూ.9.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.